సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో, డ్రగ్‌ కేసులో బాలీవుడ్‌ బడా దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ పై ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్‌ని కెరీర్‌ పరంగా తొక్కేశాడని సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న టైమ్‌లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఇటీవల డ్రగ్స్ మాఫియా వ్యవహారం బయటకు రావడంతో మరోసారి కరణ్‌ పేరు వినిపించింది. బాలీవుడ్‌ లో రాణించాలంటే, అవకాశాలు రావాలంటే కరణ్‌ జోహార్‌ పార్టీకి రావాల్సిందే అనే వార్తలు వినిపించాయి. 

మరోవైపు డ్రగ్స్ సరఫరా దారులుగా ఎన్సీబీ గుర్తించిన క్షితిజ్ ప్రసాద్, అనుభవ్‌ చోప్రాలకు కరణ్‌కి సంబంధం ఉందని, కరణ్‌కి వారు అత్యంత సన్నిహితులని వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై కరణ్‌ స్పందించారు. ఆ ఇద్దరితో తనకు ఎలాంటి సంబంధమూ లేదని తెలిపారు. ధర్మా ప్రొడక్షన్స్ సంస్థలో అనుభవ్‌ చోప్రా ఉద్యోగి కాదని,  2011-12 మధ్య కాలంలో కేవలం రెండు నెలలు మాత్రమే పనిచేశాడని తెలిపారు. 

క్షితిజ్‌ ప్రసాద్‌ మాసంస్థలో ఓ ప్రాజెక్ట్ కోసం గతేడాది ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా జాయిన్‌ అయ్యాడు. ఆ ప్రాజెక్ట్ సెట్‌ కాలేదు. అంతకు మించి వారితో, వారి పర్సనల్‌ లైఫ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదని కరణ్‌ తెలిపారు. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోవాలని, డ్రగ్ డీలర్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. 

బాలీవుడ్‌లో డ్రగ్‌ కేసు పెద్ద దుమారమే రేపుతున్న విషయం తెలిసిందే. సుశాంత్‌ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది. ఆమె కొంత మంది సినీ ప్రముఖుల పేర్లని చెప్పింది. వారిలో దీపికా పదుకొనె, రకుల్‌, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే వీరిని ఇప్పటికే ఎన్సీబీ విచారించింది. నిన్న రకుల్‌, దీపికా మేనేజర్‌ కరిష్మాని ఎన్సీబీ విచారించగా, ఈ రోజు(శనివారం) దీపికా, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌లను విచారిస్తున్నారు.