బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తన నివాసంలో సినీ ప్రముఖులకు డ్రగ్స్ పార్టీ ఇచ్చారని సోషల్ మీడియాలో వస్తోన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. తన ఇంట్లో జరిగిన పార్టీకి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేయడంతో నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు.

అంతేకాదు.. కరణ్ జోహార్ పార్టీలో నటులంతా డ్రగ్స్ మత్తులో ఉన్నారని శిరోమణి అకాలీదళ్‌ ఎమ్మెల్యే మంజిందర్‌ సింగ్‌ సిర్సా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీకి దీపికా పదుకోన్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, మలైకా అరోరా వంటి తారలు హాజరయ్యారు. డ్రగ్స్ కి సంబంధించిన విషయంపై స్పందించిన కరణ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

వారమంతా షూటింగ్ లతో బిజీగా ఉంటూ అలసిపోయిన నటీనటులందరూ కాస్త రిలాక్స్ అయ్యే విధంగా తన ఇంట్లో విందు ఏర్పాటు చేశానని.. నిజంగానే సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకొని ఉంటే తాను ఆ వీడియోను షేర్ చేసేవాడినా..? అంటూ ప్రశ్నించారు.

తన తల్లి సైతం తమతో పాటు పార్టీలో కొద్దిసమయం కూర్చున్నారని చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేవిధంగా పార్టీ ఏర్పాటు చేశామని.. తన పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనేఆరోపణల్లో నిజం లేదని.. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు!