కరోనా మహమ్మారి సినీ రంగాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే షూటింగ్‌లు, సినిమా రిలీజ్‌ లు ఆగిపోయి వేల కోట్ల రూపాయల నష్టాలు వాటిళ్లగా సినీ ప్రముఖఇళ్లలో వస్తున్న పాజిటివ్‌ కేసులు ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం కలిగిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ నిర్మాత కరీం మొరానీ తో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లకు పాజిటివ్‌ అని తేలటంతో ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం మొదలైంది. తరువాత గాయని కనికా కపూర్‌ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇటీవల బాలీవుడ్‌ బడా ప్రొడ్యూసర్‌ బోనీ కపూర్‌ ఇంట్లో కరోనా కేసులు నమోదైన సంగతి తెలసిందే. బోని ఇంట్లో ముగ్గురు పని వారికి కరోనా సోకినట్టుగా నిర్థారణ అయ్యింది. తాజాగా మరో బడా ప్రొడ్యూసర్ ఇంట్లోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ ఇళంట్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టుగా ఆయన స్వయంగా ప్రకటించారు. సోమవారం రాత్రి ఆయన ఈ మేరకు తన సోషల్ మీడియా పేజ్‌లో  ఓ ప్రకటన విడుదల చేశారు.

`నా ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్థారణ అయ్యింది. వారిని లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వెంటనే మా బిల్డింగ్‌లోనే వారిని క్వారెంటైన్‌లో ఉంచాము. బీఎంసీకి తెలియజేశాము. బిల్డింగ్ మొత్తాన్నినింబంధనలకు అనుగుణంగా శుభ్రపరిచాము. ఇంట్లో ఉంటున్న మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవు. మా కుటుంబ సభ్యులతో పాటు స్టాప్‌ అంతా సురక్షితంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం అందరం స్వాబ్‌ టెస్ట్ చేయించుకున్నాం. అందరికీ నెగెటివ్‌ వచ్చింది.

అయినా 14 రోజుల పాటు క్వారెంటైన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. అందరి రక్షణ కోసం మేం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం` అంటూ ప్రకటన చేశాడు కరణ్‌ జోహార్. ఆ ఇంట్లో కరణ్‌ జోహార్ తో పాటు ఆయన తల్లి హిరూ, పిల్లలు యష్‌, రూహిలు ఉంటున్నారు.