కరోనా మహమ్మారి అనేక మంది ప్రజలతోపాటు సెలబ్రిటీలను బలితీసుకుంటుంది. ఇప్పుడు మరో నటుడు కన్నుమూశారు. కన్నడ నటుడు శని మహదేవప్ప(88) కరోనాతో ఆదివారం మరణించారు. గత వారం ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. అనారోగ్యానికి గురవడంతో ఓ ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్‌మెంట్‌ అందించారు. చికిత్స పొందుతూ, ఆదివారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు. 

మహదేవప్ప మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. పునీత్‌ రాజ్‌ కుమార్‌, కిచ్చ సుదీప్‌ వంటి వారు సంతాపం తెలియజేశారు. ఆయన మరణంగా చిత్ర పరిశ్రమకి తీరని లోటన్నారు. మహదేవప్పకి భార్య, కొడుకు, కూతురు న్నారు. గతంలో మహదేవప్ప వయోభారంతో కూడిన సమస్యలు ఎదుర్కొన్నారు. 

1933లో మాంధ్యకి చెందిన మాలవల్లిలో జన్మించారు. 1962లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన డా.రాజ్‌ కుమార్‌కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆయనతో కలిసి నటించారు. `శంకర్‌ గురు`, `ఒంటి సలగ`, `శ్రీ శ్రీనివాస`, `గురుబ్రహ్మ`, `అప్పీ`, `భక్త కుంబర`, `శ్రీనివాస కళ్యాణ`, `కవిరత్న కాళిదాస`లతోపాటు అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. `శనీశ్వర మహాత్మే` చిత్రంలోని ఆయన నటనకు మంచి గుర్తింపు దక్కింది. దీంతో శని అనేది తన ఇంటి పేరుని చేసుకున్నారు. మహదేవప్ప  అంత్యక్రియలు సోమవారం నిర్వహించారు.