సినిమా ప్రపంచంలో ట్విస్ట్ మాదిరి ఒక నటుడు పన్నిన కుట్ర కూడా ఊహించని మలుపు తిరిగింది. హత్య చేయబోయి చివరికి కటకటాలపాలయ్యాడు. బెంగుళూరుకు చెందిన ఒక కన్నడ సినీ నటుడు అమ్మాయిని మోసం చేసి రెండవ వివాహం చేసుకోవడమే కాకుండా ఆమెను హత్య చేయాలనీ భావించాడు. 

చివరికి స్నేహితుడి వల్ల పద్మ శ్రీ అనే యువతి ప్రాణాలతో బయటపడింది. అసలు వివరాల్లోకి వెళితే.. సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఒక యువతికి మాయమాటలు చెప్పి వర్ధమాన నటుడు శబరీష్ శెట్టి వివాహం చేసుకున్నాడు. తనకు స్టార్ హీరోలు, పెద్ద పెద్ద నిర్మాతలు తెలుసని తప్పకుండా నిన్ను హీరోయిన్ ని చేస్తానని నమ్మించాడు. 

కేఆర్‌ పురం శివార్లలోని భట్టరహళ్లిలో కాపురం పెట్టిన శబరీష్ అసలు రంగు కొన్నేళ్ళకే పద్మ శ్రీకి తెలిసింది. అతనికి ముందే పెళ్లి అయ్యిన విషయం తెలియడంతో వెంటనే నిలదీసింది. కొన్ని రోజుల వరకు వాగ్వివాదాలు నడిచాయి. ఇక నిజం బయటపడింది కాబట్టి ఆమెను అంతమొందించాలని శబరీష్ కుట్ర పన్నాడు. 

ఐదుగురు స్నేహితులని పిలిపించి ఆమెను హత్య చేయాలనీ ప్లాన్ వేశాడు. మత్తు మందు ఇచ్చి ఆమెను స్పృహ కోల్పోయేలా చేశాడు. అయితే హత్య చేయాలనీ అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా పద్మశ్రీ స్నేహితుడు అక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు వారుంటున్న స్థలానికి చేరుకొని పద్మ శ్రీని కాపాడి శబరీష్ ని మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నలుగురు పరారిలో ఉన్నారు.