ప్రస్తుతం చాలా సినిమాలో రెగ్యులర్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ను పక్కన పెట్టి డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కోలీవుడ్‌ మూవీ పొన్‌మగల్ వందాల్‌తో పాటు బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్ నటించిన గులాబో సితాబో లాంటి భారీ చిత్రాలు కూడా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ లిస్ట్‌లో మరో భారీ చిత్రం చేరనుందన్న ప్రచారం జరుగుతోంది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం తలైవి. ఈ విషయంపై పింక్‌ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది కంగనా రనౌత్‌. తలైవి సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చెప్పింది. ఈ సందర్భంగా చిత్రాలను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయటంపై  స్పందించింది కంగనా. కొన్ని సినిమాలను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేయటం మంచి నిర్ణయమే అని చెప్పింది.

అయితే తలైవి లాంటి సినిమాల విషయంలో మాత్రం అది కుదరదని తేల్చింది. ఎందుకంటే తలైవి భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా ఆ స్థాయిలో కలెక్షన్లు రావాలంటే థియేటర్లలో రిలీజ్ చేయాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఇదిలా ఉండగా తలైవి డిజిటల్‌ హక్కులను భారీ ధరకు విక్రయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు 55 కోట్లు పలికినట్టుగా ప్రచారం జరుగుతోంది.