ఓ వైపు బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కి, మహారాష్ట్ర సర్కార్‌కి, మరోవైపు కంగనాకి, బాలీవుడ్‌కి మధ్య యుద్ధం జరుగుతుంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో నెపోటిజంపై, అలాగే డ్రగ్స్ మాఫియాపై కంగనా బోల్డ్ అండ్‌ సెన్సేషనల్‌ కామెంట్‌ చేస్తూ వస్తున్నారు. బాలీవుడ్‌లోని ప్రముఖులను టార్గెట్‌గా కంగనా విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. 

తాజాగా పార్లమెంట్‌లో జయాబచ్చన్‌ చేసిన వ్యాఖ్యలపై కంగనా స్పందించింది. అంతేకాదు ఘాటైన విమర్శలు కురిపించింది. `జయాజీ. నా స్థానంలో మీ కూతురు శ్వేత ఉంటే ఇలానే మాట్లాడేవారా, ఇండస్ట్రీలో వేధిస్తున్నారని అభిషేక్‌ చెబితే ఇలానే మాట్లాడేవారా? అని ప్రశ్నించింది. 

ఇంకా కంగనా మాట్లాడుతూ, ఇండస్ట్రీకి స్త్రీవాదం నేర్పించింది నేను. ఎందుకంటే పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో హీరోతో గడిపినప్పటికీ నాకు చిన్న పాత్రల్లో మాత్రమే అవకాశాలిచ్చారు. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న పాత్రలు, రొమాంటిక్‌ సన్నివేశాలకు మాత్రమే నన్ను చూపించారు. హీరోయిన్‌గా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మీ వల్ల కాదు. ఎన్నో మంచి కథాబలం ఉన్నసినిమాల్లో నటించడం వల్లే  ఈస్థాయికి వచ్చాను` అని తెలిపింది. 

దీంతో జయాపై చేసిన ఈ వ్యాఖ్యలు సైతం ఇప్పుడు బాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. గతంలో కాస్టింగ్‌ కౌచ్‌పై అనేక ఆరోపణలు చేసిన కంగనా తాను హీరోలతో గడిపిన విషయం ఇప్పుడు తెలపడం మరింత దుమారం రేపుతున్నాయి. మరి కంగనా వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి. పార్లమెంట్‌లో ఎంపీ రవికిషన్‌ చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ జయా బచ్చన్‌  స్పందిస్తూ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్‌ని అవమానించేలా మాట్లాడుతున్నారని రవికిషన్‌ని, కంగనాకి కౌంటర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.