గృహిణులకు జీతాలు ఇవ్వాల్సిన సమయం వచ్చేసిందని  ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’ అధ్యక్షుడు కమల్‌ హాసన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ ‘విజన్‌ డాక్యుమెంట్‌-తమిళనాడు 2021’ను తన ట్వీటర్‌ ఖాతా ద్వారా కమల్‌ ఈ విషయాన్ని  ప్రకటించారు. తమిళనాడు రూపురేఖలను మార్చటం.. తమిళ రాజకీయాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటం అనే సూత్రాలతో రాష్ట్రంలో రెండు రెట్ల మార్పు తీసుకురావటమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. 

అలాగే ‘‘అసలు గృహిణిగా ఉండటమే ఓ పెద్ద ఉద్యోగం. దానికి తగినట్లుగా మహిళలకు వేతనం చెల్లించాలి. గృహిణులు నిర్వహిస్తున్న విధులకు తగిన ప్రతిఫలం చెల్లించాలనే ఆలోచన అమలులో పెట్టే సమయం వచ్చేసింది.’’ అని కమల్‌ తన భవిష్యత్‌ ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు అంతటా వ్యక్తం అవుతున్నాయి.

 బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మాత్రం, కమల్‌ ఆలోచనను తప్పుబడుతూ మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడకండి. మాతృత్వం కోసం అమితంగా ప్రేమించే వారితో శృంగరానికి వెల కట్టడం కరెక్ట్‌ కాదు. ఓ భార్యగా, తల్లిగా ఇంట్లో పనిచేయడం మహిళల హక్కు దానికి మీరు వెల కట్టకండి. ఇంటి యజమానురాలైన మహిళను తన సొంతింటిలోనే ఉద్యోగిగా మార్చకండి. మాకు కావాల్సింది వేతనం కాదు.. సమాజంలో గౌరవం, ప్రేమ. భగవంతుడి సృష్టికి డబ్బులు చెల్లించాలనుకుంటున్న మీ ఆలోచనను మార్చుకోండి’ అంటూ కంగనా మండిపడ్డారు. 

అయితే కమల్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ ఎంపీ శిశీథరూర్ సమర్థించారు. ఆయన ఆలోచన తీరు ప్రశంసనీయమని థరూర్‌ ఆయనను కోనియాడారు. ఇది సమాజంలో మహిళా గృహిణుల సేవలను గుర్తించి, వారి శక్తిని, స్వయంప్రతిపత్తిని మెరుగుపరుస్తుంది మరియు విశ్వవ్యాప్త ప్రాథమిక ఆదాయాన్ని సృష్టిస్తుంది" అని శశిధరూర్ ట్వీట్ చేసారు.