హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల జరిగిన ఓ సంఘటనపై స్పందించారు. హీరోయిన్ సంయుక్త హెగ్డే పట్ల ఓ మహిళ ప్రవర్తించిన తీరును కాజల్ ఖండించడం జరిగింది. గత శుక్రవారం బెంగుళూరులో గల అగర లేక్ పార్క్ కు హీరోయిన్ సంయుక్త హెగ్డే మరియు ఆమె ఫ్రెండ్స్ జాగింగ్ చేయడానికి వెళ్ళారు. పార్క్ లో వార్మ్ అప్ చేస్తున్న వీరి వస్త్రధారణ చూసిన కవితా రెడ్డి అనే ఓ మహిళ దూషణ మొదలుపెట్టారట. మీరేమైనా క్యాబిరే డాన్సర్స్ నా, పబ్లిక్ లో ఈ డ్రెస్ ఏంటని వారిని దుర్భాషలాడారట. ఆ సంఘటనకు సంబంధించిన వీడియోని హీరోయిన్ సంయుక్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. 

సదరు వీడియోని ట్యాగ్ చేస్తూ కాజల్ ఒకింత ఆశ్చర్యం, ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇలాంటి సంఘటన జరిగిందని నమ్మలేక పోతున్నాను, మిస్ కవితా రెడ్డి మీ కోపాన్ని మీరు అదుపులో పట్టుకోండి, ఈ నిరాశ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోండి. అమ్మాయిలు ఏమి ధరించాలి అనేది వారి సొంత విషయం, మన పని మనం చూసుకుంటే మంచిది'  అని కాజల్ ట్వీట్ చేశారు. అమ్మాయిలు ఏమి ధరించాలో, ఎలా ఉండాలో మరో అమ్మాయి చెప్పడం కాజల్ ని దిగ్బ్రాంతికి గురిచేసినట్లు అన్పిస్తుంది . 

ఆడవాళ్ళ స్వేఛ్ఛను ఆడవాళ్లే ప్రశ్నిస్తున్నట్లు ఈ ఘటనపై కాజల్ కొంచెం ఘాటుగానే స్పందించడం జరిగింది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో సంయుక్త హెగ్డే ఘటన చర్చనీయాంశంగా మారింది. సదరు మహిళను విమర్శించిన కాజల్ సంయుక్త హెగ్డేకు బాసటగా నిలిచింది. కాగా ప్రస్తుతం కాజల్ తెలుగులో చిరంజీవి సరసన ఆచార్య మూవీతో పాటు, మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు చిత్రంలో కూడా నటిస్తుంది.