కరోనా మహమ్మారి వినోద రంగం మీద దారుణమైన ప్రభావం చూపించింది. లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్ లతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిలిచిపోయాయి. దీంతో సినీ రంగం వేల కోట్ల రూపాయలు నష్టపోతోంది. షూటింగ్ పూర్తికాని సినిమాల విషయం పక్కన పెడితే ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఈ సినిమాల విషయంలో నిర్మాతలు కొత్త దారులు వెతుకుతున్నారు. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేదు. ఒక వేళ తెరుచుకున్నా ప్రజలు ఏ మేరకు థియేటర్లకు వస్తారు అన్నది అనుమానమే.

దీంతో నిర్మాతలు సినిమాలను డైరెక్ట్‌గా డిజిటల్‌లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు చిన్న సినిమాల నిర్మాతలు డైరెక్ట్‌గా తమ సినిమాలను డిజిటల్‌లో రిలీజ్ చేశారు. తాజాగా బడా చిత్రాల నిర్మాతలు కూడా ఇదే బాటలో అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ హీరో సూర్య, తాను నిర్మించిన పొన్‌మగల్‌ వందాల్ సినిమాను డైరెక్ట్‌గా డిజిటల్‌ లో రిలీజ్ చేసేందుకుప్లాన్ చేస్తున్నాడు. కానీ థియేటర్ల యాజమాన్యాలు మాత్రం ఈ నిర్మాతలను ఇబ్బంది పెడుతోంది.

అయితే తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించిన సినిమానే డైరెక్ట్‌గా డిజిటల్‌లో రిలీజ్ చేస్తున్నారు. సుజిత్‌ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానాలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్‌ 17న రిలీజ్ చేయాలని భావించారు. కానీ లాక్‌ డౌన్ కారణంగా వాయిదా  పడింది. లాక్ డౌన్‌ పూర్తయ్యే సరికి భారీ చిత్రాలు రిలీజ్‌కు రెడీ కావటంతో ఈ సినిమా కు రిలీజ్ డేట్‌ దొరకటం కష్టం అని, డైరెక్ట్‌గా డిజటల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

ఈ విషయాన్ని అమితాబ్‌ బచ్చన్ స్వయంగా ప్రకటించారు. ఈ సినిమాలో బిగ్ బి గులాబో పాత్రలో నటిస్తుండగా ఆయుష్మాన్‌ సితాబో పాత్రో కనిపించనున్నాడు. రిలీజ్‌కు రెడీగా ఉన్న ఈ సినిమాను డైరెక్ట్‌గా అమేజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ అవుతోంది.