నందమూరి నట వారసుడిగా వెండితెర అరంగేట్రం చేసిన యువ నటుడు  ఎన్టీఆర్. ఓ అనామకుడిగా వెండితెర మీద అడుగుపెట్టిన ఎన్టీఆర్‌, ఒక్కో సినిమాతో తనని తాను మలుచుకుంటూ టాప్ హీరోగా ఎదిగాడు. నందమూరి అభిమానుల అంచనాలు అందుకున్న ఈ జనరేషన్ కథనాయకుడు ఎన్టీఆర్‌ ఒక్కడే అనటంలో ఏమాత్రం అతిషయోక్తి లేదు. బాల రామాయణం సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఎన్టీఆర్ తరువాత నిన్ను చూడాలని సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయం అయ్యాడు. అయితే తొలి సినిమాతో నటుడిగా ఆకట్టుకోలేకపోయిన ఎన్టీఆర్ విజయం సాదించలేకపోయాడు.

అయితే ఎన్టీఆర్‌లోనే కసే అతన్ని హీరోగా ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఎదురైన అవమానాలు, ఇబ్బందులనే సోపానాలుగా చేసుకొని తిరుగులేని యువ కథానాయకుడిగా ఎదిగాడు. కెరీర్‌ తొలినాళ్లలో నటుడిగా మెప్పించలేకపోయిన ఎన్టీఆర్, ప్రస్తుతం వన్‌ ఆఫ్‌ ద ఫైనెస్ట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు ఎన్టీఆర్‌. విజయాలు, అపజయాలు, పొరపాట్లు, తడబాట్లు ఇలా అన్ని కలిసి ఎన్టీఆర్‌ను హీరోగానే కాదు, వ్యక్తిగానూ ఉన్నతంగా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం నందమూరి అభిమానుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నాడు ఎన్టీఆర్‌.

బుధవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సాధారణంగా ఈ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే వారు ఎన్టీఆర్ అభిమానులు. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా అలాంటి పరిస్థితి లేకపోవటంతో తారక్ కూడా స్వయంగా అభిమానులను బయటకు రావద్దరి కోరాడు. దీంతో ఇళ్లకే పరిమిత మైన యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ రాత్రి నుంచే మొదలైన హడావిడి ఈ రోజు మరింతగా పెరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామ స్మరణే కనిపిస్తోంది.