విలన్ గా, హాస్యనటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మూడు దశాబ్దాలు వెండితెరపై వెలిగిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి నేడు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. గుంటూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకోగా టాలీవుడ్ దిగ్బ్రాంతికి గురైంది. పలువురు చిత్ర ప్రముఖులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. లాక్ డౌన్ వలన షూటింగ్స్ కి బ్రేక్ పడిన నేపథ్యంలో భార్యతో కలిసి జయప్రకాష్ రెడ్డి గుంటూరులోనే ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు, చిత్ర ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. 

 జయప్రకాష్ రెడ్డి అంత్యక్రియలు కూడా కుటుంబ సభ్యులు నిర్వహించడం జరిగింది.నేడు సాయంత్రం గుంటూరు జిల్లా కొరిటెపాడులో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. కరోనా వైరస్ కారణంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి చిత్ర ప్రముఖులు ఎవరూ పాల్గొనలేదని సమాచారం. 

ఇక చిత్ర ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియాజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లతో పాటు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేయడం జరిగింది.