ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి(74) నేటి ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. గుండెపోటు రావడంతో బాత్రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. ఆయన మ‌ర‌ణం.. చిత్ర‌సీమ‌ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపధ్యంలో ఎందరో ఆయనతో తమకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటున్నారు. అలాగే కేవలం సినిమాలకే ఆయన పరిమితం కాలేదు. నాట‌క‌రంగంతోనూ ఆయ‌న‌కు ఎంతో అనుబంధం ఉంది. ఆయ‌న నాట‌కాల నుంచి.. సినిమాల‌వైపు అడుగుపెట్టారు. సినిమాల్లోకి వ‌చ్చి ఎన్నో ప్రముఖ పాత్రలు చేసినా, నాట‌కాల‌పై ప్రేమ త‌గ్గ‌లేదు. సినిమా న‌టుడిగా బిజీగా ఉన్న‌ప్పుడు కూడా ఏదో ఓ నాట‌కంతో మెరిసేవారు. 

ఇక చిన్న‌ప్ప‌టి విశేషాలు చూస్తే అప్పటినుంచీ.. ఆయ‌న‌కు నాట‌కాలంటే మ‌క్కువ‌. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే...ఆయ‌న స్త్రీ పాత్ర‌తో అరంగేట్రం చేశారు. అప్ప‌ట్లో ఆయ‌న చాలా స‌న్న‌గా ఉండేవారు. అందుకే స్త్రీ వేషం ర‌క్తి క‌ట్టింది. తొలి నాట‌కం, తొలి పాత్ర‌తోనే ఉత్త‌మ న‌టి అవార్దు ద‌క్కించుకున్నారు. అప్ప‌టి నుంచీ... నాట‌కాల‌తో అనుబంధం ముడిప‌డిపోయింది. 

ఇక అలెగ్జాండ‌ర్ అనే నాట‌కం ఆయ‌న‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇది ఏక పాత్ర ఉన్న నాట‌కం. దాదాపు 100 నిమిషాల నిడివి గ‌ల అతి పెద్ద నాట‌కం. అందులో అలెగ్జాండ‌ర్ గా... జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి న‌ట విశ్వరూపం నాట‌క‌రంగంలో ఆయ‌న‌కు ఎంతోమంది అభిమానులు ఏర్ప‌డేలా చేశాయి. ఈ నాట‌కాన్ని సినిమాగా కూడా తీద్దామనుకున్నారు. దానికి ఆయ‌నే ద‌ర్శ‌కుడు కూడా. కానీ.. ఆ ప్ర‌య‌త్నాలు మ‌ధ్య‌లో ఆగిపోయాయి.

 జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలు నేడు కొరిటెపాడు శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. అయితే జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలకు ఆయన తనయుడు దూరంగా ఉండనున్నారు.  జయప్రకాశ్ రెడ్డి కుమారుడు, కోడలికి ఇటీవల కరోనా సోకింది. వీరు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నారు.

 ఈ కారణంగా నటుడు జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలకు ఆయన తనయుడు నిర్వహించలేకపోతున్నారు. దీంతో బంధువులు, సన్నిహితులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్న సన్నిహితులు, మిత్రులు, ఆర్టిస్టులు గుంటూరు, విద్యానగర్‌లోని నటుడి ఇంటికి వెళ్తున్నారు.