కేవలం టీవీల్లో ప్రోగ్రామ్స్ చెయ్య‌డం, సినిమాల్లో క్యారెక్ట‌ర్స్ చెయ్య‌డ‌మే కాదు, స‌మాజం ప‌ట్ల కూడా మంచి అవ‌గాహ‌న ఉంది అనసూయకు.  సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయ, స‌మాజంలో జ‌రిగే కొన్ని ఘ‌ట‌న‌ల‌పై స్పందిస్తూ ఉంటుంది.  ఇటీవ‌ల మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకుంది అనసూయ. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా తన మొదటి పీరియడ్స్ అనుభవాన్ని దైర్యంగా అందరితో షేర్ చేసుకుంది. ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. 

అనసూయ మాట్లాడుతూ.. ''నా ఫస్ట్ పీరియడ్ సమయంలో నేను గందరగోళానికి లోనయ్యాను. పీరియడ్ వచ్చిందా లేదా అనే డౌట్ వచ్చింది. నా మొదటి పీరియడ్ సమయంలో ఇంట్లో వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్లనీయకుండా ఇంట్లోనే ఓ మూలన కూర్చోబెట్టారు. ఫస్ట్ పీరియడ్ టైములో రెండు వారాలు అలానే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రతినెలా నాలుగైదు రోజులు ఎవరినీ కలవనిచ్చేవారు కాదు. ఆ టైంలో ఏమి జరుగుతుందో నాకేమీ అర్థమయ్యేది కాదు. కానీ నాకు 17 ఇయర్స్ వచ్చిన తర్వాత దాని గురించి ఒక అవగాహన వచ్చింది. 

ఇంట్లో వాళ్ళు పీరియడ్స్ విషయంలో చేసింది కరెక్ట్ కాదని అర్థం అయింది.. కానీ వారిని నిందించడానికి ఏమీ లేదు. ఎందుకంటే అప్పటి పరిస్థితులు అలా ఉండేవి. పీరియడ్స్ గురించి ఎన్నో అపోహలు మూఢనమ్మకాలు ఉన్నాయి. నిజానికి అలాంటి సమయంలోనే మహిళలకి హెల్ప్ అవసరం. అలా దూరంగా ఉంచడం కరెక్ట్ కాదు'' అని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా సమాజంలో ఇప్పటికి చాలా చోట్ల ఇలాంటి అపోహలు ఇంకా ఉన్నాయి. పీరియడ్స్ అనేది ఏదో తప్పైనట్లు లేడీస్ వాటి గురించి మాట్లాడడానికి భయపడుతుంటారు. కొంతమంది మగవాళ్ళు పీరియడ్స్ సమయంలో వారిని అర్థం చేసుకోకుండా లోకువగా మాట్లాడుతుంటారు. అది చాలా తప్పు. ఇంటికి మహాలక్ష్మిగా భావించే ఆడవారు మన జీవితంలో ఉండటం.. కుటుంబంలో ఉండటం ఒక వరం. 'అమ్మ'గా భార్యగా చెల్లిగా కూతురిగా టీచర్ గా ఫ్రెండ్ గా ఇలా అన్ని పాత్రల్లో స్త్రీ ఉంటుంది. సృష్టికి మూలకారణమే స్త్రీ అని అంటుంటారు.

 అలాంటిది వారిలో సహజంగా వచ్చేదే పీరియడ్. కాబట్టి అందరూ దీనిపై ఎడ్యుకేట్ అవ్వాలి. నెలసరిలో ఉన్న లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తూ వారి భాదను షేర్ చేసుకుంటూ వారికి అండగా ఉండండి'' అని చెప్పుకొచ్చింది అనసూయ. ఏదేమైనా యాంకర్ అనసూయ తన ఫస్ట్ పీరియడ్ గురించి ఇలా డేర్ గా అందరితో షేర్ చేసుకోవడం గొప్ప విసయమనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.