కరోనా ఎఫెక్ట్ తో చిన్న నిర్మాతలకు ఓ రకమైన సమస్యలైతే, పెద్ద నిర్మాతలకు మరో రకం సమస్యలు మొదలయ్యాయి. షూటింగ్ లు, రిలీజ్ లు వంటివన్నీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడ్డాయి. అయితే అదే సమయంలో తమ సినిమాలకు తీసుకున్న వడ్డీలు పెరిగిపోతూండటం ఆందోళన కలిగించే విషయమైతే, మరో ప్రక్క తమ సినిమాల కోసం ఆల్రెడీ తీసుకున్న అడ్వాన్స్ ఇవ్వాల్సి రావటం మరో సమస్యగా మారనుంది. టాలీవుడ్ లో ప్రచారం జరుగుతున్న దాన్ని బట్టి ఓవర్ సీస్ మార్కెట్ వైపు నుంచి పెద్ద నిర్మాతలకు సమస్యలు మొదలవుతున్నాయి. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో రిలీజ్ డేట్ చెప్పలేని  పరిస్దితుల్లో అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వమని ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కోరుతున్నట్లు వినపడుతోంది. మరో సంవత్సరం దాకా ఈ సినిమాలు రిలీజ్ కాకపోతే తాము ఇచ్చిన భారీ అడ్వాన్స్ లు పరిస్దితి ఏమిటని ఆలోచనపడుతున్నారట.

 తాము బిజినెస్ రొటేషన్ కోసం వేరే చోటనుంచి తెచ్చిన సొమ్ము కావటంతో నిర్మాతలు అడ్వాన్స్ లు వెనక్కి ఇస్తే తాము రిలీఫ్ అవుతామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న ప్రాజెక్టులు రిలీజ్ డేట్ ప్రకటించటానే మళ్లీ తిరిగి ఇస్తామని చెప్తున్నారట. ఈ మేరకు భారీ డిమాండ్ వినిపిస్తోందని చెప్తున్నారు. ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య పై ఈ ఒత్తిడి ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాదాపు సంవత్సరం క్రితమే ఓవర్ సీస్ డీల్ క్లోజ్ అయ్యింది. దుబాయి కు చెందిన కంపెనీ 62 కోట్లు ఇచ్చి అన్ని లాంగ్వేజ్ లకు ఓవర్ సీస్ రైట్స్ లాక్ చేసుకుంది. అయితే ఆ డిస్ట్రిబ్యూటర్ ..డబ్బు వెనక్కి ఇవ్వద్దు కానీ.ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎంతమంది థియోటర్స్ కు వస్తారో ...రిలీజ్ నాటి పరిస్దితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి..తాము ఎగ్రి అయ్యిన మొత్తం డిస్కౌంట్ అడుగుతున్నారట. 

ఇక ఇదిలా ఉంటే తమిళ చిత్రం మాస్టర్ ని దీపావళి రిలీజ్ కు పెడుతున్నారు. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బు వెనక్కి ఇవ్వమని, ఎగ్రిమెంట్స్ తిరిగి రాసుకుందామని డిమాండ్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, నానీ వి , రామ్ రెడ్, మైత్రీ వారి ఉప్పెన కు కూడా ఈ ఓవర్ సీస్ సెగ తగిలిందంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ..నిజంగా ఇదే జరిగితే మాత్రం పెద్ద నిర్మాతలకు చాలా ఇబ్బందికరమైన సమయం. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన అడ్వాన్స్ లు ప్రాజెక్ట్ లో పెట్టబడిగా పెట్టేసి ఉంటారు. దాన్ని వెనక్కి తీసుకుని ఇవ్వాలంటే కష్టమే కదా.