నందమూరి నటసింహం బాలకృష్ణ  ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల్లో ఒకరు. తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ తో క్యారక్టర్స్ పండించటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గదు..వారసలు ఇంకా రాకపోయినా ఆయన ఎక్కడా వెనకడుగు వెయ్యటం లేదు. ఇప్పటికీ సాలిడ్ సినిమా వస్తే వందరోజులు ఆడే సత్తా ఉంటుంది. అయితే ఈ ఘనత అంతా బాలయ్య తన డైరక్టర్స్ కు ఇస్తూంటారు. తను వాళ్లేం చెప్పినా చేస్తూంటాను అని, అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనని, అదే తన సక్సెస్ కు కారణమని చెప్తారు. అందులో వందకు వంద శాతం నిజం ఉందంటారు ఆయనతో పనిచేసిన డైరక్టర్స్. అలా డైరక్టర్స్ డెసిషన్స్, స్క్రిప్టు పై ఆధారపడే బాలయ్య పై రీసెంట్ గా ఓ వార్త మీడియాలో హల్ చల్ చేయటం మొదలెట్టింది. 

అదేమిటంటే.. బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న మూవీలో ఓ పాత్రలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి సైతం ధ్రువీకరించడం జరిగింది. అయితే ఈ పాత్ర కోసం బాలకృష్ణ స్టడీ చేస్తున్నారట. నిజమైన అఘోరాలు ఎలా ఉండారు..వారి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన వంటి అనేక విషయాలు వీడియోలు , పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నారని ఆ వార్త సారాంశం. ఆ పాత్రలో ఖచ్చితత్వం సాధించడం కోసం ఆయన ఇలా చేస్తున్నారని, లాక్ డౌన్ సమయాన్ని ఇలా వినియోగించుకున్నట్లు చెప్తున్నారు. అయితే హీరోలు తమ పాత్రల కోసం స్టడీ చేయటంలో వింతేమీ లేదు కానీ బాలయ్య మాత్రం ఇలా స్వంతంగా స్టడీలు అవీ చేయరని చెప్తున్నారు. 

ఆయన పూర్తిగా డైరక్టర్స్ మనిషి. వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంటారు. తన సొంత తెలివితేటలు రుద్దాలనుకోరు..కాబట్టి బోయపాటి ఎలా ఈ క్యారక్టర్ ని డిజైన్ చేసారో అలాగే బాలయ్య కనిపిస్తారు. మహా అయితే బాలయ్యకు బోయపాటి ఏదైనా వీడియో ఇచ్చి ఇలా చేద్దాం అనచ్చు కానీ అలా బోయపాటి కూడా చేయరు అంటున్నారు. బోయపాటి యూట్యూబ్ వీడియోలు చూసి అందులో లాగ తన సినిమాలో సీన్ ఉండాలని కోరుకోరని చెప్తున్నారు. కాబట్టి ఇది నమ్మదగ్గ న్యూస్ కాదని తేలుస్తున్నారు.

 ఈ చిత్రంలో కొన్ని నిమిషాల వ్యవధిలో జన్మించిన కవల సోదరులుగా ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారని బోయపాటి చెప్పారు. ఈ మూవీలో ఇప్పటివరకు బాలయ్య ఎప్పుడూ కనిపించని పాత్రలో నటించబోతున్నారు. ఇందులో బాలయ్య లుక్ చాలా విభిన్నంగా ఉంటుంది. అంతేకాదు చాలా సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. వాటన్నింటిని నేను ఇప్పుడు రివీల్ చేయను. సినిమా చూసిన తరువాత మీకే తెలుస్తుంది అని బోయపాటి చెప్పారు.  మిర్యాలగూడ రవీంద్రరెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీలో హీరోయిన్‌గా కొత్త భామను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారు.