బాలీవుడ్‌ స్టార్ యాక్టర్‌ ఇర్పాన్‌ ఖాన్ గత నెల 29న ముంబైలోని కోకిలా బెన్‌ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్‌లో మరణించిన సంగతి తెలిసిందే. సుధీర్ఘ కాలం పాటు క్యాన్సర్‌తో పోరాడిన ఆయన చివరకు తుదిశ్వాస విడిచారు. లాక్‌ డౌన్ సమయంలో ఆయన మరణించటంతో అభిమానులే కాదు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కూడా ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన మృతితో శోక సంద్రంలో మునిగిపోయిన అభిమానులను ఉద్దేశిస్తూ గతంలో ఇర్ఫాన్ భార్య సుతాప సిక్దర్‌ ఓ లేఖ విడుదల చేశారు.

తాజాగా ఇర్ఫాన్‌ ఖాన్ ఈ లోకాన్ని విడిచి నెల రోజులు అయిన సందర్భంగా ఆమె తన భర్తను ఎంతగా మిస్ అవుతుందో తెలుపుతూ తన సోషల్ మీడియా పేజ్‌లో మరోసారి భావోద్వేగంగా స్పందించారు. `ఇది మన కలయికు విరామం మాత్రమే ` అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు సుతాప. ఈ కామెంట్‌తో పాటు గతంలో ఇర్ఫాన్‌తో కలిసి తాను దిగిన కొన్ని ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే ఈ పోస్ట్ పై అభిమానులు కూడా అదే ఉద్వేగంగా స్పందిస్తున్నారు. ఇర్ఫాన్‌ కుటుంబానిరి తామున్నామంటూ కొంత మంది బరోసా ఇస్తుండగా.. మరికొంది ఓ విలక్షణ నటుడ్ని, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని కోల్పోయిన బాధ నుంచి కోలుకోలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాన్‌ సింగ్ తోమర్‌, ద నామ్‌సకే, ముఖ్‌బూల్‌, హాసిల్‌, హైదర్‌, పీకులాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్, చివరగా అంగ్రేజీ మీడియం సినిమాలో నటించాడు.