యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ పౌరాణికచిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను టీ సిరీస్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌కు సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది, ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా లెజెండరీ మ్యూజీషియన్ ఎమ్ ఎమ్‌ కీరవాణిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. దాదాపు కీరవాణినే ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజే మారిపోయింది. దీంతో ఆ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్‌లో ప్లాన్ చేస్తున్నారు.

బాహుబలి తరువాత సాహో సినిమా చేసిన ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత నాగ అశ్వినీ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ సినిమాను ప్లాన్ చేశాడు ప్రభాస్‌. అయితే తాజాగా నాగ అశ్విన్ సినిమా కన్నా ముందే ఆది పురుష్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆదిపురుష్ తరువాత నాగ అశ్విన్‌ సినిమాకు డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట ప్రభాస్.