వచ్చే ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే జరగనుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఐదుగురు సభ్యులలో ఒకరు విన్నర్ కానున్నారు. అరియనా, అఖిల్, సోహైల్ , అభిజీత్ మరియు హారిక టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ గా హౌస్ లో ఉన్నారు. ఇప్పటికే టైటిల్ ఎవరు గెలవనున్నారు అనే విషయంపై అనేక ఊహాగానాలు మొదలైపోయాయి. అనేక మీడియా సంస్థలు దీనిపై వరుస పోల్స్ నిర్వహిస్తున్నారు. టైటిల్ ఫెవరేట్స్ గా అభిజీత్, అరియనా మరియు సోహైల్ ముఖ్యంగా రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. 
 
ఎప్పటిలాగే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసం టాలీవుడ్ నుండి ఓ స్టార్ హీరో రానున్నారు. బిగ్ బాస్ సీజన్ 2కి నాని హోస్ట్ గా ఉండగా... విక్టరీ వెంకటేష్ అతిథిగా రావడం జరిగింది. సీజన్ టూ విన్నర్ కౌశల్ కి వెంకీ చేతుల మీదుగా ట్రోఫీ అందించారు. ఇక సీజన్ 3 ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. హోస్ట్ నాగార్జునతో పాటు స్టేజ్ పంచుకున్న చిరంజీవి టైటిల్ విన్నర్ రాహుల్ కి బహుమతి అందజేయడం జరిగింది. 
 
మరో రెండు రోజులలో బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఉండగా గెస్ట్ ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం మరలా బిగ్ బాస్ ఫినాలే గెస్ట్ గా చిరంజీవి రానున్నారట. మహేష్, ఎన్టీఆర్ అంటూ కొందరు స్టార్స్ పేర్లు వినిపించినా ఫైనల్ గా చిరంజీవినే ఫినాలే గెస్ట్ గా తేనున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.