మీకు గుర్తుందా.. ఆమధ్యన డ్రగ్స్‌ కేసులో హీరో రవితేజ సిట్ ముందు హాజరయ్యారు. కెల్విన్‌, జాక్‌ కాల్‌ లిస్టులో రవితేజ, అతని డ్రైవర్‌ నెంబర్లు ఉన్నట్లు అధికారులు భావించారు. రవితేజకు డ్రగ్స్‌ ఇచ్చినట్టు జాక్ విచారణలో అంగీకరించాడు. దీంతో సిట్‌ విచారణలో రవితేజ అత్యంత కీలకం అయ్యారు. రవితేజ డ్రగ్స్‌ తీసుకున్నాడా?... ఎవరికైనా సరఫరా చేశాడా? వంటి ప్రశ్నలను సిట్ అడిగింది. ఆ తర్వాత ఆ కేసు ని మూసేసారు. రవితేజ తనకు ఎలాంటి సంభందం లేకుండా ఈ కేసులో ఇరికించారారని అన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే.. 

దర్శకుడిగా శ్రీనువైట్ల ప్రయాణం ‘నీకోసం’తో మొదలైంది. అందులో హీరోగా రవితేజ న‌టించాడు. ఆ త‌రువాత కాలంలో ‘దుబాయ్‌ శీను’తో ఇద్దరూ మంచి హిట్‌ కొట్టారు. ఇప్పుడు వీరిద్ద‌రూ మ‌రోసారి జ‌ట్టు క‌ట్ట‌ి చేస్తున్న చిత్రం అమర్ అక్బర్ ఆంథోనీ. 

రవితేజ ఈ సినిమాలో మూడు పాత్రలు చేస్తూ...  తన ఫాన్స్ కి ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతున్నారు. అయితే రవితేజ,శ్రీను వైట్ల ఇద్దరూ ఫామ్ లో లేకపోవటంతో రకరకాలుగా సినిమాని ప్రమోట్ చెయ్యాల్సి వస్తోంది. అలాగే సినిమాలోనూ మాగ్జిమం ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో తన గత చిత్రాల్లో జనాలని అలరించిన ఎలిమెంట్స్ ని రిపీట్ చేసే పనిలో ఉన్నారట శ్రీను వైట్ల. 

గతంలో బ్రహ్మానందం ను అడ్డం పెట్టి ఓ మ్యూజిక్ డైరక్టర్స్ పై సెటైర్స్ వేసిన శ్రీను వైట్ల, ఆ తర్వాత మరో సినిమాలో..ఎమ్ ఎస్ నారాయణతో స్టార్ హీరోలపై సెటైర్స్ వేసారు. ఎన్టీఆర్ తో చేసిన బాద్షా లోనూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని గుర్తు చేసే పాత్రను రివేంజ్ నాగేశ్వరరావు అనే పేరుతో పెట్టి నవ్వించారు. ఇప్పుడు ఈ చిత్రంలోనూ అలాంటి స్కీమ్ ఒకటి ఉండబోతోందని సమాచారం. 

ఆ మధ్యన తెలుగు పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ రాకెట్ ని, అందులో విచారించిన వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఓ కామెడీ ట్రాక్ రాసారట. రవితేజ కూడా అప్పట్లో ఈ కేసులో విచారణను ఎదుర్కొన్నారు. ఇవన్నీ గుర్తు చేస్తూ...ఈ ట్రాక్ రన్ అవుతుందిట.  అయితే  సిట్  కాకుండా అమెరికాలో ఎఫ్ బి ఐ ఈ పని చేసినట్లుగా ఉంటుందని టాక్. ఈ ట్రాక్ లో సునీల్, వెన్నెల కిషోర్, రఘుబాబు, సత్య, జయప్రకాష్ రెడ్డి ఉండి నవ్వించబోతున్నారు. ఇప్పుడు ఈ యాంగిల్ లో ట్రైలర్ చూస్తే మీకు కొంత క్లూ దొరుకుతుంది.

రవితేజ, శ్రీను వైట్ల కెరీర్ తొలినాళ్ల‌నుంచీ మంచి మిత్రులు కావ‌డం, వీరిద్ద‌రిదీ మంచి హిట్ కాంబినేష‌న్ కూడా కావటంతో మంచి అవుట్ పుట్ వచ్చిందని టాక్. కెరీర్ లో స‌మాంత‌రంగా  ఎదుగుతూ వ‌చ్చిన ఈ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం మంచి స‌క్సెస్ అవ‌స‌ర‌మైన స్థితిలో ఉండటంతో కసితో పనిచేసినట్లు తెలుస్తోంది. వారి కష్టం ఏ స్దాయిలో ఫలించనుందనే విషయం నవంబర్ 16న తేలనుంది.