మహేష్ కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది దూకుడు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ పోలీస్ గా నటించిన ఈ చిత్రంలో ఆయన బాడీ లాంగ్వేజ్ మరియు తెలంగాణా యాక్సెంట్ ఫ్యాన్స్ కి కొత్త అనుభూతిని పంచాయి. 2011 టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన దూకుడు విడుదలై  9ఏళ్ళు అవుతుంది. 2011 సెప్టెంబర్ 23న విడుదలైన దూకుడు మహేష్ కి భారీ హిట్ కట్టబెట్టింది. 

2005లో పోకిరితో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మహేష్ వరుసగా మూడు పరాజయాలు చవిచూశారు. సైనికుడు,అతిథి, ఖలేజా చిత్రాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి. దీనితో దర్శకుడు శ్రీను వైట్ల కథను మహేష్ ఒకే చేయడం జరిగింది. మహేష్ యాక్షన్, సమంత గ్లామర్ ఈ మూవీకి విజయంలో దోహదం చేశాయి. దూకుడు మూవీ భారీ విజయంలో క్రెడిట్ బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణలకు కూడా ఇవ్వాల్సిందే. ముఖ్యంగా బ్రహ్మానందం మరియు మహేష్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ ఎపిసోడ్స్ థియేటర్స్ లో ఓ రేంజ్ లో పేలాయి. 

ఇక ముసలి వయసులో ఎమ్మెస్ నారాయణ హీరో వేషాలు కడుపుబ్బా నవ్వించాయి. యాక్షన్ కి మించి కామెడీ బాగా క్లిక్ కావడంతో మూవీకి భారీ విజయం దక్కింది. థమన్ సాంగ్స్ కూడా దూకుడు చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. మొత్తంగా కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నీ కలగలిపి ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించారు. మహేష్ ని ఫుల్ ఫార్మ్ లోకి తెచ్చిన చిత్రంగా దూకుడు నిలిచింది.