Asianet News TeluguAsianet News Telugu

'ఐఐటి కృష్ణమూర్తి' రివ్యూ

లాజిక్కులూ, ఫ‌జిల్లూ, బ్యాక్ స్టోరీ.. సరిగ్గా లేకపోతే థ్రిల్లర్  సినిమాలు రక్తి కట్టవు. ఆ విషయం దాదాపు ప్రతీ క్రైమ్ థ్రిల్లర్ వండే దర్శకుడుకు తెలుసు. అయితే అవన్నీ ఉన్నాయనుకునే కథలు రెడీ చేసేసి తెరకెక్కేంచేస్తున్నారు. అయితే తాము అనుకునే లాజిక్, ప్రేక్షకుడు చూసేటప్పుడు జరిగే మ్యాజిక్ సింక్ కానప్పుడే అసలు సమస్య. అలా సింక్ అయిన సినిమాలన్నీ సూపర్ హిట్లైపోతాయి. మిగలినవన్నీ సమాధుల్లా మిగులుతాయి. అదేం లెక్కో కానీ ఓటీటిలలో డైరక్ట్ తెలుగు సినిమాలు రిలీజ్  ప్రారంభం అయిన నాటి నుంచి థ్రిల్లర్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో ఆకట్టుకునేవి తక్కువ..మన ఆటకట్టించేవి ఎక్కువ. తాజాగా రిలీజైన 'ఐఐటి కృష్ణమూర్తి' కూడా క్రైమ్ థ్రిల్లర్ అంటూ మన ముందుకు వచ్చింది. అది ఏ స్దాయి థ్రిల్లరో..దాని కథా, కమామీషు ఏమిటో చూద్దాం. 
 

IIT Krishnamurthy telugu movie review jsp
Author
Hyderabad, First Published Dec 10, 2020, 5:34 PM IST

కథేంటి

ముంబై ఐఐటీ స్టూడెంట్ కృష్ణమూర్తి (ఫృద్వీ) మిస్సైన తన బాబాయ్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తాడు. అన్వేషణ మొదలెడతాడు. తన ఐఐటీ తెలివితేటలను ఉపయోగిస్తాడు. పోలీస్ లను సైతం ఆశ్రయిస్తాడు. అయితే ఈ జర్నీలో కృష్ణమూర్తి మీద కొంతమంది గుర్తు తెలయని వ్యక్తుల దాడి జరగుతుంది. అలాగే పోలీస్ లు సైతం ఓ గుర్తు తెలియని శవాన్ని అంటగట్టి కేసు క్లోజ్ చెయ్యాలని చూస్తున్నారని అర్దమవుతుంది. అసలేం జరుగుతోంది. తన చుట్టు ఉన్న అనేకానేక అనుమాన్సద డాట్స్ ని కలిపి ఆ మిస్టరీని ఎలా ఛేధించాడు..అతని బాబాయ్ ని ఎవరు చంపారు...ఆ హత్యకు పోలీస్ లకు సంభందం ఏమిటి...చివరకు ఏమైంది..అనేది మిగతా కథ. 
 
ఎలా ఉందంటే...

చిన్న సినిమాలు కాన్సెప్ట్ కథలు పట్టుకుని విజయం సాధించాలి. అలాగే థ్రిల్లర్ కథలు సక్సెస్ అంతా..స్టోరీ పాయింట్ లో కన్నా వాటిని చెప్పే నేరేషన్ లో ఉన్న బ్యూటీతో వస్తుంది. అయితే వరల్డ్ సినిమా చూస్తున్న నేటి ప్రేక్షకుడుని ఆషామాషీ నేరేషన్ తో మెప్పించటం అసాధ్యం. అలాగే చెప్పే కథలో నిజాయితీ లేకపోతే ఎక్కడో చోట దొరికిపోతాం. అప్పటికీ దర్శకుడు ప్రతీ చిన్న విషయానికీ  లాజిక్ రాసుకున్నాడు. కాకపోతే కథకు మూలమైన కీపాయింట్ విషయంలోనే లాజిక్ లేదేమో అనిపిస్తుంది. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్స్ లో హంతకుడు లేదా అనుమాతుడు పొరపాటునో, లేక నిర్లక్ష్యం తోనే  చేసే తప్పు అతన్ని పట్టిస్తూంటుంది. కానీ అదేంటో ఇక్కడ అడుగడుక్కీ అవే కనిపిస్తూంటాయి. అదీ ఈ సినిమా స్పెషాలిటీ.

ఇక  క్లైమాక్స్ విషయంలో దర్శకుడు ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాల్సింది. అప్పటికీ కిల్లర్ సస్పెన్స్ ని చివర్లోనే రివీల్ చేసారు. అది నిజంగా బాగా పేలాల్సిందే. అయితే అప్పటికే చూసేవాళ్లకు నీరసం వచ్చేస్తుంది. దాంతో అక్కడ ఎంత గొప్ప ట్విస్ట్ ఉన్నా వృధానే. క్లైమాక్స్ ట్విస్ట్ ని నమ్ముకుని సినిమా చేసేవాళ్లు..మిగతా సీన్స్ కూడా అంతే ఇంట్రస్టింగ్ గా నడపాలనే విషయం మర్చిపోతే అసలుకే ఎసరు వస్తుంది. అంతేకాదు..ఆ ట్విస్ట్ ని ఓ మాదిరి ఓపిక,సహనం ఉండి సినిమాని ఫాలో అయితే గెస్ చేసేస్తారు. తొలి సగంతో పోలిస్తే.. ద్వితీయార్థం ఫరవాలేదనిపిస్తుంది. మిస్సింగ్ నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేషన్‌లో థ్రిల్లింగ్ మూమెంట్స్ పెద్దగా కనిపించవు. ఎప్పటికైనా మళ్లీ కథ ట్రాక్ ఎక్కుతుందేమో అని చాలా ఆశగా ఎదురుచూస్తూంటాము. అదీ ఉండదు. 

పోనీ ఎమోషన్‌గా కనెక్ట్ అవుతుందేమో అని ఆశిస్తాం. అది అసలు ఉండదు. 'ఏదో మిస్ అయ్యిందే' అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంటుంది. డైరక్టర్ కు అది కూడా కలిగినట్లు లేదు. ఇంక హీరో,హీరోయిన్ ట్రాక్ మెయిన్ కథకు అసలు సంభందం ఉండదు. హీరోయిన్ కూడా సెకండాఫ్ లో కాసేపు మాయమైపోతుంది. సత్య కామెడీ బాగానే ఉంది కానీ పెద్దగా కలిసొచ్చేదేమీ కాదు. 
 
 దర్శకత్వం,మిగతా విభాగాలు

డైరక్టర్ స్క్రిప్టు రాసుకోవటంలోనే ఫెయిల్ అయ్యారు. అంతేకాదు దాని ఎగ్జిక్యూషన్ లోనూ అంతే అనాసక్తిని కనపరిచారు. కథలోని మెయిన్ ట్విస్ట్ రిజస్టర్ కానివ్వడు. అంత స్పేస్ మనకివ్వడు. సినిమాలో ఎక్కడో చోట ట్విస్ట్ ఉంటుందని ఎక్సపెక్ట్ చేసి ఎదురుచూస్తామనే విషయం కూడా దర్శకుడు గమనించలేదు. ఇక సంగీతం కూడా సోసో గా ఉంది. కెమెరా వర్క్, ఎడిటింగ్ నీట్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..ఒకే థీమ్ మాటి మాటికీ రిపీట్ అవుతుంటుంది. నిర్మాణ పరంగా పూర్తి మార్కులు పడతాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.

ఈ సినిమాలో కొత్తగా పరిచయమైన కుర్రాడు చూడటానికి బాగున్నాడు. ఈ పాత్ర‌లో బాగా ఒదిగిపోవటానికి ప్రయత్నించాడు. కానీ ఆ క్యారక్టర్ లో అంతకు మించి స్కోప్ లేదు. ఆ క్యారక్టర్ మైండ్ మూసేసి ఉంటుంది. దాంతో అతనితో మనం జర్నీ చేయటం కష్టమైపోతుంది.  త‌న యాటిట్యూడ్‌, లోలోప‌ల ప‌డుతున్న స్ట్ర‌గుల్‌… ఇవ‌న్నీ చ‌క్క‌గా ప‌లికాయి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్ గురించి మాట్లాడుకోవటానికి లేదు. ఆమె కథలో ఓ ఐటంలా వచ్చి వెళ్లిపోతుంది అంతే. వినయ్ వర్మ మాత్రం సినిమాలో బాగా హైలెట్ అయ్యారు.   

ఫైనల్ థాట్

ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ..సినిమా ఇది..ఎలా అంటే..ఎప్పుడు పూర్తవుతుందా..కట్టేసి వెళ్లిపోదామా అని సీట్ చివర కూర్చుని ఎదురుచూస్తాం.
  --సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:1.5  

 
ఎవరెవరు..
బ్యానర్లు: క్రిస్టోలైట్‌ మీడియా క్రియేషన్స్‌, అక్కి ఆర్ట్స్‌  
నటీనటులు: పృధ్వీ దండమూడి, మైరా దోషి, సత్య, వినరు వర్మ, బెనర్జీ తదితరలు
సంగీతం: నరేశ్‌ కుమారన్‌ 
కెమెరా: ఏసు, 
ఎడిటింగ్‌ :  అనిల్‌ కుమార్‌.పి, 
సంగీతం: నరేశ్‌ కుమారన్‌, 
సహనిర్మాత :  అక్కి,
 స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం:  శ్రీవర్ధన్‌.
 సమర్పణ : మ్యాంగో మాస్‌ మీడియా
రన్ టైమ్:110 నిముషాలు
విడుదల తేదీ:10,డిసెంబర్ 2020.
ఓటీటీ:అమేజాన్ ప్రైమ్
 

Follow Us:
Download App:
  • android
  • ios