పదేళ్ల  తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన  మెగాస్టార్ చిరంజీవి తానే బాక్స్ ఆఫీస్ బాద్షా తానే అని కలెక్షన్స్ తో నిరూపించుకున్నాడు. అదే ఊపులో ‘సైరా’ సినిమాతో  భారీ బడ్జెట్ తో పెద్ద సాహసం చేశారు. తొలి సారి తన కెరీర్‌లో చారిత్రాత్మక చిత్రంలో నటించారు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు మీడియా సైతం బాగా సపోర్ట్ చేసింది..పాజిటివ్ రివ్యూలు ఇచ్చింది. విడుదలైన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ దిశగా దూసుపోతున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే విడుదలైన మూడో రోజు నుంచే వసూళ్లు తగ్గుతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఓవర్ సీస్, నార్త్ లో ఈ సినిమా బాగా దారుణంగా కలెక్షన్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ డ్రాప్ చాలా స్పీడ్ గా కనపడుతోందంటున్నారు. దసరా శెలవలు ఉండటం, అమితాబ్,సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ అండ ఉన్నా ఇలా కలెక్షన్స్ తగ్గటం ట్రేడ్ కు షాక్ ఇస్తోంది. అందుకు కారణం సక్సెస్ టాక్ తెచ్చుకున్న సినిమాని సరైన రీతిలో ప్రమోట్ చేసి నిలబెట్టలేకపోవటం అంటున్నారు.

యువ నిర్మాత రామ్ చరణ్ సినిమా తీయటం భారీగా ఖర్చు పెట్టి తీసారు కానీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఫెయిలయ్యారంటున్నారు. అదే అల్లు అరవింద్ నిర్మాత అయితే ఖచ్చితంగా ఈ హైప్ ని రెట్టింపు చేసేవాడని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. అరవింద్ అనుభవం ఖచ్చితంగా ఇలాంటి ప్రాజెక్టులకు ఉపయోగపడేదని అంటున్నారు. రామ్ చరణ్ తన మేనమామ అరవింద్ సలహా, సూచనలు తీసుకుంటే బాగుండేదని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. 

‘సైరా’ ప్రీ రిలీజ్ బిజినెస్  అదిరిపోయే రీతిలో చేసినప్పటికీ.. కలెక్షన్స్ విషయంలో మాత్రం డీలా పడటం డిస్ట్రిబ్యూటర్స్ ని కంగారుపెడుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు ఆ  ఇండస్ట్రీల్లో గట్టి పోటీనే ఎదురైంది. అక్టోబర్ 2న హిందీలో ‘వార్’ విడుదల కాగా.. హాలీవుడ్‌లో ‘జోకర్’ రిలీజయ్యింది. తమిళంలో ‘అసురన్’ విడుదలైంది. ఇలా వరస పెట్టి అనేక పెద్ద  సినిమాలు బాక్స్ ఆఫీస్‌పై దండయాత్ర చేయడంతో ‘సైరా’ కలెక్షన్స్‌పై ప్రభావం పడింది.

దానికి తోడు లెంగ్త్  మరీ ఎక్కువగా ఉండటం..రిపీట్ సీన్స్ ఉండటం... డైలాగులు సగటు ప్రేక్షకుడికి అర్ధంకాని రీతిలో సాగటం.. లాజిక్ లేని ఫైట్లు.. మెల్లగా మెగాస్టార్ లెవెల్ ని కుదిస్తున్నాయి.