గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి ఎంతో మంది ను శోక సంద్రంలో ముంచేసింది. ఈ విషయాన్ని సినిమా, సంగీత లోకం ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతుంది.  అయితే అదే సమయంలో ఆయన చెన్నై ఎంజీఎం హాస్పిటల్‌లో ఎస్సీ బాలు కుటుంబ సభ్యులు చెల్లించిన బిల్లు ఇదే అంటూ సోషల్ మీడియా,వాట్సప్ లలో  విస్తృతంగా ప్రచారమైంది. అంతేకాకుండా, ఎస్పీ బాలు హాస్పిటల్ బిల్లుని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ కట్టారంటూ వాట్సప్ సందేశాలు మొదలయ్యాయి. ఈ విషయమై ఆమె క్లారిటీ ఇస్తూ మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో ఏమున్నదంటే..
 

దివంగత శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి వైద్య బిల్లుల చెల్లింపులు నేను చేసినట్లుగా వస్తున్న కొన్ని వాట్సప్ సందేశాలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతుండడం బాధాకరం.. ఇది పూర్తిగా అవాస్తవం. వాటిని దయచేసి ఫార్వర్డ్ చేయవద్దని మనవి.
రెండు వారాల క్రితం ఇంకేమీ చెల్లించనవసరం లేదని ఆసుపత్రి యజమాన్యం దివంగత శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి తెలియజేశారు. ఆస్పత్రి ఉత్తమ చికిత్సను అందించడమే గాక, వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నాకు, అదే విధంగా కొన్ని సార్లు మా తండ్రి గారికి సమాచారం ఇస్తున్నారు. శ్రీ బాలు గారు మా కుటుంబానికి దగ్గర వారైనందున మాకు ఈ విషయాలు తెలియజేశారు.

శ్రీ మతి దీపా వెంకట్