హైదరాబాద్‌లో హెల్మెట్ నిబంధన తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. లేకపోతే ఫొటో తీసి మరీ చలానాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల చేసిన ఓ ఫొటో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ బైకర్.. నెంబరు ప్లేట్ కింద రాసిన కామెంట్‌కు పోలీసులు భలే ఫన్నీ రిప్లే ఇచ్చారు. హెల్మెట్ లేకుండా బైకు నడపడమే కాకుండా, నెంబరు ప్లేటు కింద ‘నే హెల్మెట్ పెట్టుకోను. నిజమైన మనిషిలాగే చనిపోతా’ అని కామెంట్ చేసిన వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు చలానా వేయడంతో పాటు ట్విట్టర్ ద్వారా అతనికి దిమ్మతిరిగే జవాబు ఇచ్చారు. 

హెల్మెట్ పెట్టుకోని ఆ వ్యక్తిని ఉద్దేశిస్తూ... ‘‘సర్, మిమ్మల్ని మేము చనిపోనివ్వం. మీరు ఎప్పటికీ నిజమైన మనిషిలా బతికేలా చూడటానికే ఇష్టపడతాం. దయచేసి హెల్మెట్ ధరించి, బైక్ రైడ్ చేయండి’’ అని ట్రాఫిక్ పోలీసులు సమాధానిచ్చారు. ఇప్పుడీ ట్వీట్ జాతీయ స్థాయిలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సమయ స్ఫూర్తికి అంతా ఫిదా అవుతున్నారు.