డ్రగ్స్ కేసు.. హీరో నవదీప్ ఇంట్లో నార్కొటిక్ బ్యూరో సోదాలు..!
సినీ హీరో నవదీప్ ఇంట్లో నార్కొటిక్ బ్యూరో సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఇటీవల బయటపడిన డ్రగ్స్ కేసులో పోలీసులు నవదీప్‌ను నిందితుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే.

సినీ హీరో నవదీప్ ఇంట్లో నార్కొటిక్ బ్యూరో సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే సోదాల సమయంలో నవదీప్ ఇంట్లో లేనట్టుగా సమాచారం. హైదరాబాద్ మాదాపూర్‌లో ఇటీవల బయటపడిన డ్రగ్స్ కేసులో పోలీసులు నవదీప్‌ను నిందితుడిగా పేర్కొన్నారు. అయితే నవదీప్ తనను అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఈ నెల 19 వరకు నవదీప్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కేసులో నవదీప్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.
ఇక, నవదీప్ అతని స్నేహితుడు రామ్‌చంద్ నుంచి డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే రామ్‌చంద్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు సినీ దర్శకుడు, మాజీ ఎంపీ కొడుకు సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో వాంటెడ్ గా ఉన్న నటుడు నవదీప్ పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
నవదీప్ తరపు న్యాయవాది సిద్ధార్థ వెంకట్ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ.. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నవదీప్ డ్రగ్స్ వినియోగదారుడని పోలీసులు పేర్కొన్నారని.. అయితే ఆయనను నిందితుడిగా నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. అరెస్టు చేసిన వారి రిమాండ్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కేసు విక్రయం, సర్క్యులేషన్ లేదా స్మగ్లింగ్‌తో నటుడికి సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని వాదించారు. ప్రాథమిక విచారణ చేయకుండానే అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారని లాయర్ తెలిపారు. ఈ పరిణామాలు నవదీప్ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. నవదీప్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి నవదీప్‌ను అరెస్టు చేయవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణకు మంగళవారానికి(సెప్టెంబర్ 19) వాయిదా వేశారు.