ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఫస్ట్ టైమ్‌ ప్రభాస్‌తో పూజాహెగ్డే రొమాన్స్ చేస్తుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమాని దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ రూపొందిస్తున్నారు. భగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఇటీవల ఇటలీలో షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా అక్కడ తన అభిమానులతో ప్రభాస్‌ సందడి చేశాడు. 

ఇక ఇప్పుడు హైదరాబాద్‌లో షూటింగ్‌కి రెడీ అవుతుంది చిత్రం బృందం. ఇందులో క్లైమాక్స్ సీన్‌ని తెరకెక్కించబోతున్నారు.  అందుకోసం భారీ సెట్‌ని వేస్తుంది. అయితే దీనికి అయ్యే ఖర్చు తెలిస్తే మాత్రం మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుంది. ఏకంగా క్లైమాక్స్ సెట్‌ కోసం రూ. ముప్పై కోట్లు ఖర్చు చేస్తున్నారట. సినిమాకి హైలైట్‌గా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ నిలుస్తుందని, అందుకోసం హాలీవుడ్‌ టెక్నీషియన్లు పనిచేయబోతున్నారని సమాచారం. యాక్షన్‌ ప్రధానంగా ఈ క్లైమాక్స్ ఉంటుందట. 

ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమాని దాదాపు రెండు వందల కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమాని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకంపై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మిస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.