బాలీవుడ్ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ కేసు సంచలనం రేపుతుండగా, కంగనా వ్యాఖ్యలు మరింత వివాదానికి దారితీస్తున్నాయి. బాలీవుడ్ పై సోషల్ మీడియా సాక్షిగా కంగనా చేసిన ఆరోపణలను బాలీవుడ్ ప్రముఖులతో పాటు, మహారాష్ట్ర సర్కారు ఖండించింది. సీనియర్ నటి జయాబచ్చన్ మరియు హేమమాలిని, జయప్రద వంటివారి డ్రగ్స్ మాఫియాకు బాలీవుడ్ అడ్డాగా మారిందన్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరో కొందరు చేసిన తప్పిదాలకు బాలీవుడ్ మొత్తాన్ని నిందించడం సరికాదు అన్నారు. 

కాగా కంగనా తీరును కన్నడ పరిశ్రమకు చెందిన ఒకప్పటి హీరోయిన్, మాజీ ఎంపీ రమ్య తప్పుబట్టారు. నిజంగా డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా మీరు పోరాడాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు, సాక్ష్యాలు అధికారులకు ఇచ్చి, నేరస్థులను పట్టుకొనేలా చేయండి. ఒకప్పుడు నేను కూడా డ్రగ్స్ కి బానిసనే అని ఒప్పుకున్నారు కాబట్టి, డ్రగ్స్ వలన ఎదుర్కొనే సమస్యలను, ప్రతికూలతలను చెప్పి అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. ఇప్పటికే సంజయ్ దత్ అలా చేసి ఉన్నారు. దీపికా పదుకొనె మానసిక వ్యాధితో బాధపడుతున్న వారికి సేవ చేస్తున్నారు, అన్నారు. 

దీపికా, సంజయ్ దత్ లాంటి వాళ్ళను చూసి మీరు నేర్చుకోండి, అలా కాకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం, వివాదాలు లేపడం సరికాదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నటి రమ్య వ్యాఖ్యలకు కంగనా రనౌత్ ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది. బీజేపీ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం కంగనాను పావుగా ఉపయోగిస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో ఆమె తీరును చాలా మంది తప్పుబడుతున్నారు.