చెన్నై నగర వీధుల్లో స్టార్ హీరో అజిత్ కుమార్ ఆటో రైడ్ చేశారు. అంత పెద్ద స్టార్ నిరాడంబరంగా ఓ ఆటోలో ప్రయాణం చేయడం హాట్ టాపిక్ గా మారింది. మా హీరో సింప్లిసిటీ చూసి ఎవరైనా నేర్చుకోవాలి అంటూ ఆయన ఫ్యాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అజిత్ ఆటోలో ప్రయాణం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


గత ఏడాది నెర్కొండ పార్వై మూవీతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు అజిత్. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం. అదే చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హెచ్ వినోత్.. అజిత్ లేటెస్ట్ మూవీ వాలిమై తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీపై అజిత్ ఫ్యాన్స్లో భారీ అంచనాలున్నాయి. 


వాలిమై మూవీలో హీరో కార్తికేయ కీలక రోల్ చేయడం విశేషం. ఇక అజిత్ పుట్టినరోజు కానుకగా వాలిమై ఫస్ట్ లుక్ మే 1న విడుదల కానుంది. వాలిమై చిత్రంలో హుమా ఖురేషి హీరోయిన్ గా నటించడం విశేషం. వాలిమై చిత్రానికి కూడా బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.