సోషల్ మీడియా అభివృద్ధి చెందుతున్న దగ్గర నుంచి దాని వల్ల లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో, నష్టాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు సోషల్ మీడియా వేదికగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ లేడీ స్టాండప్‌ కమెడియన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. సోషల్ మీడియా వేదికగా స్టాండప్‌ కమెడియన్‌ అగ్రిమా జాషువా పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన శుభం మిశ్రా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముంబైకి చెందిన అగ్రిమా జాషువా 2019లో మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్న ఛత్రపతి శివాజీ స్టాట్యూ గురించి ఓ కామెడీ షోలో వివాదాస్సద వ్యాఖ్యలు చేసింది. ఇది జరిగిన ఏడాది తరువాత కొంతమంది నెటిజెన్లు ఆమె మీద సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. శుభం మిశ్రా అనే వ్యక్తి అభ్యంతరకర భాష్లలో అగ్రిమాపై కామెంట్లు చేశాడు. ఛత్రపతి శివాజీ గురించి కామెంట్లు చేసినందుకు అగ్రిమాను రేప్‌ చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. ఈ మేరకు శనివారం తన ఇన్‌స్టా పేజ్‌లో పోస్ట్  చేశాడు.

మిశ్రా వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారటంతో ఎన్‌సీడబ్ల్యూ చైర్మన్ రేఖా శర్మ ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలను గుజరాత్ డీజీపీకి లేఖ రాశారు. మహిళలకు సోషల్‌ మీడియా ద్వారా ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో ఎన్‌సీడబ్ల్యూ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నింధితుడు శుభం మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు.