ఆరడుగుల కటౌట్, మాస్ అప్పీల్ ఉండే లుక్ తో గోపీచంద్ కు కలసి వచ్చే అంశాలు. నటన పరంగా కూడా గోపీచంద్ పలు చిత్రాల్లో ప్రశంసలు దక్కించుకున్నాడు. గోపీచంద్ ఇటీవల విభిన్నమైన కథలని ఎంచుకుంటున్నాడు. 

తాజాగా గోపీచంద్, తమిళ దర్శకుడు తిరు కాంబినేషన్ లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ చిత్రం చాణక్య నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే యూఎస్ లో చాణక్య చిత్ర ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన, సినిమా టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

సీనియర్ నటుడు నాజర్ లీడ్ చేసే రా (Raw) సంస్థలో గోపీచంద్ అండర్ కవర్ ఆఫీసర్. చాణక్య చిత్రం పర్వాలేదనిపించే విధంగా ఉంది. ఇలాంటి స్పై థ్రిల్లర్ చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కథనం కూడా ఉత్కంఠ భరితంగా సాగాలి. గోపీచంద్ తన నటనతో, యాక్షన్ సీన్స్ లో పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ కొన్ని సన్నివేశాలని దర్శకుడు తిరు రొటీన్ గా చిత్రీకరించారు. గోపీచంద్, హీరోయిన్ మెహ్రీన్ మధ్య సాగే లవ్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. 

గోపీచంద్ పాల్గొనే అండర్ కవర్ ఆపరేషన్స్ మాత్రం కొంతవరకు థ్రిల్ ని కలిగిస్తాయి. సెకండ్ హాఫ్ లో కూడా సినిమా ఆసక్తికరంగా అనిపించదు. స్పై థ్రిల్లర్ గా దర్శకుడు ఈ చిత్రంపై అంచనాలు పెంచాడు. కానీ క్లైమాక్స్ లో రొటీన్ కమర్షియల్ సినిమా తరహాలోనే చాణక్య చిత్రం ముగుస్తుంది. ఓవరాల్ గా చాణక్య యావరేజ్ చిత్రంగా మిగిలిపోనున్నట్లు యూఎస్ ప్రీమియర్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది.