సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు గ్రేటర్‌ హైదరబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు షాక్ ఇచ్చారు. లాక్‌ డౌన్‌ సమయంలో దర్శక నిర్మాతలు అంతా ఖాళీగా ఉంటే వర్మ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు తన సొంత ఏటీటీలో రిలీజ్ చేసిన వర్మ మరిన్ని సినిమాల రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు. అయితే వర్మ కంపెనీ నుంచి రిలీజ్‌ అయిన తాజా చిత్రం పవర్‌ స్టార్‌.

ఎన్నికల తరువాత పవన్‌ కళ్యాణ్‌ పరిస్థితిపై సెటైరికల్‌గా తెరకెక్కించిన ఈ సినిమా తొలి రోజు నుంచే వివాదాలకు కేంద్ర బింధువుగా మారింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లు వేయించాడు వర్మ. అంతేకాదు లాక్ డౌన్‌ తరువాత పోస్టర్లు వేసిన తొలి సినిమా అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో ప్రమోట్‌ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్‌ వర్మను చిక్కులో పడేసింది.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ వ్యక్తి జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం అధికారులకు ఫిర్యాదు చేశాడు. తన సినిమా ప్రమోషన్‌ కోసం ప్రభుత్వ ఆస్తిని వర్మ వినియోగించుకున్నాడంటూ సదరు వ్యక్తి ఫిర్యాదు చేయటంతో సంబంధిత అధికారులు స్పందించారు. వర్మ చేసిన పనికి గానూ ఈ నెల 22న 4 వేల రూపాయల జరిమానా విధించారు. అయితే పవర్‌ స్టార్ సినిమాతో పొందిన లాభాలతో పోలిస్తే ఇదేమంతా విషయం కాదంటున్నారు వర్మ అభిమానులు.