బిగ్ బాస్ సీజన్ 3 కొద్దిరోజుల్లోనే మొదలుకానుంది. ఈ షో మొదలుకాకముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే యాంకర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులు తనను లైంగికంగా వేధించారని, షోలో పాల్గొనాలంటే కమిట్మెంట్ అడుగుతున్నారని ఆరోపణలు చేసింది. తాజాగా మరో నటి బిగ్ బాస్ షోపై సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ నిర్వాహకులు తనను వేధించారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే.. 'ఫిదా' ఫేం నటి గాయత్రీ గుప్తా ఆదివారం నాడు బిగ్ బాస్ షోపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ నిర్వాహకులు రఘు ఓ సారి ముంబై నుండి తనకు ఫోన్ చేసి షోలో నటించాలని కోరాడని.. వంద రోజుల పాటు నటించేందుకు ఒప్పందం కూడా చేసుకున్నట్లు చెప్పింది.

రఘుతో పాటు అభిషేక్ గుప్తా, రవి తన ఇంటికి వచ్చి షో ముందు నుండే మరో సినిమాలో నటించకూడదని రూల్ పెట్టినట్లు.. ఆ ప్రకారమే ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పింది. అదే సమయంలో వంద రోజుల పాటు సెక్స్ లో పాల్గొనకుండా ఉండగలవా..? అని వారు ప్రశ్నించారని గాయత్రి గుప్తా తెలిపింది. దీనికి ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపింది.

అయితే విషయం బయటకి చెప్పకుండా సెలెక్షన్ కోసం ఎదురుచూశానని.. రెండు రోజుల క్రితం బిగ్ బాస్ 3లో తన పేరు లేదనే విషయం తెలుసుకున్నట్లు చెప్పింది. ఒప్పందం కారణంగా సినిమాల్లో వచ్చిన అవకాశాలు కోల్పోవడంతో సుమారు రూ.16 లక్షలు ఆర్థికంగా నష్టపోయినట్లు తెలిపింది. బిగ్ బాస్ షో కారణంగా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు లైంగిక వేధింపులకు గురైనట్లు.. దీనికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.