బిగ్‌బాస్‌ 4 రెండో వారాంతం సందడిగా సాగింది. వినోదం, భావోద్వేగం, ఉత్కంఠ, షాకింగ్‌, సర్‌ప్రైజ్‌ ఇలా నవరసాల మేళవింపుగా సాగిందని చెప్పొచ్చు. ఇందులో రెండో వారం రెండో ఎలిమినేషన్‌ చివరి క్షణంలో ఓ ట్విస్ట్ తో బయటపడటంతో కథ సుఖాంతమైంది. కానీ చివరి నిమిషం వరకు మోనాల్‌ గజ్జర్‌, హారికల మధ్య ఎలిమినేషన్‌ గేమ్‌ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాని తలపించింది. 

అయితే ఆదివారం షోలో `బోన్‌ గేమ్‌` హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. రింగ్‌లో బోన్‌ ఉంటుంది. ఇద్దరు కంటెస్టెంట్‌ వచ్చి పాటకి డాన్స్ వేయాల్సి ఉంది. పాట ఆగిపోయినప్పుడు ఆ బోన్‌ ఎవరు ముందు తీసుకుంటే వారు విన్నర్. ఇద్దరిద్దరు వచ్చి డాన్స్ వేసి సందడి చేశారు. ఓడిపోయిన వారికి చిన్న చిన్న ఫనిష్‌మెంట్లు ఇచ్చారు నాగ్‌. 

సోహైల్‌, మెహబూబ్‌ మధ్య బోన్‌ కోసం పెద్ద యుద్ధమే జరిగింది. ఇద్దరూ చాలా సేపు ఫైట్‌ చేశారు. ఇది షోని రక్తికట్టించింది. ఇక గంగవ్వ, కుమార్‌ సాయి ఎపిసోడ్‌ మరింత రసవత్తరంగా సాగింది. ఇద్దరు రింగ్‌ చుట్టూ స్టెప్పులేశారు. అయితే బాలకృష్ణ నటించిన `పైసా వసూల్‌` చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌కి గంగవ్వ డాన్స్ చేయడం విశేషం. గంగవ్వ ఆ వయసులో కూడా మాస్‌ సాంగ్‌కి తనదైన స్టయిల్‌లో మాస్‌ డాన్స్ వేసి హౌజ్‌లో నవ్వులు పూయించడంతోపాటు ఊపుని తీసుకొచ్చారు. చివరలో గంగవ్వ బోన్‌ అందుకుని సాయిని ఉరికించడం ఆకట్టుకుంది. కుమార్‌ సాయి కావాలనే గంగవ్వకి బోన్‌ వదిలేశాడు.