బిగ్‌బాస్‌.. ఇండియన్‌ బుల్లితెరపై బాగా పాపులర్‌ అయిన షో. హిందీలో విశేష ప్రేక్షకాదరణ పొందింది. దీంతో దక్షిణాదిలోనూ దీన్ని నిర్వహిస్తున్నారు. తెలుగులో స్టార్‌మా ఈ షోని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాల్గో సీజన్‌ నడుస్తుంది. నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 

అయితే ఈ సారి `బిగ్‌బాస్‌4` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతుందనే విమర్శ ప్రారంభం నుంచే వినిపిస్తుంది. కంటెస్టెంట్స్ ఎంపిక నుంచే దీనిపై విమర్శలు వస్తున్నాయి. పేరు తెలియని, జనాలకు పరిచయం లేని చాలా మందిని ఎంపిక చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఇక రోజు వారి ఎపిసోడ్‌లోనూ అంతగా ఆకట్టుకునే కంటెంట్‌గానీ, యాక్టివిటీస్‌గానీ కనిపించడం లేదు. బోరింగ్‌గా సాగే రెగ్యులర్‌ ఎపిసోడ్‌లో భాగంగా రోజుకో ఈవెంట్‌తో ఎంటర్‌టైన్‌ చేయాలనే ప్రయత్నం వర్కౌట్‌ కావడం లేదు. కంటెస్టెంట్స్ లో అంత జీల్‌ కనిపించడం లేదు. పైగా సెలబ్రిటీ అని చెప్పుకునే వారు తక్కువ కావడంతో వాళ్లేం చేసినా ఆడియెన్స్ కి కిక్‌ ఇవ్వడం లేదు. 

నాగార్జున `బిగ్‌బాస్‌` సీజన్‌ 4 ప్రారంభం టైమ్‌లో నెవర్‌ బిఫోర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అన్నారు. కానీ ఇప్పుడు అదే లోపించింది. నెవర్‌ బిఫోర్‌ బోరింగ్‌ అన్నట్టుగా సాగుతుంది. రెగ్యూలర్‌గా ఎపిసోడ్‌ మొత్తం మోనాల్‌ గజ్జర్‌, అభిజిత్‌, అఖిల్‌ చుట్టూ తిరుగుతుంది. వీరి మధ్య లవ్‌ ట్రాక్‌నే సీజన్‌4 నమ్ముకుందనేలా సాగుతుంది. వీరి ట్రయాంగిల్‌ లవ్‌ ట్రాక్‌ కూడా బోర్‌ కొట్టే దశకు చేరుకుంది.  

మొదట్లో సందడి చేసిన గంగవ్వ ఎంటర్‌టైన్‌ చేయలేకపోతుంది. బలవంతంగానే ఆమె సన్నివేశాలను కంటెస్టెంట్స్ ఎంజాయ్‌ చేస్తున్నారు. మొదట్లో ఏడిపించిన కరాటే కల్యాణి డీలా పడిపోయింది. ఇంట్రడక్షన్‌లో `ఐ యామ్‌ బోల్డ్` అంటూ తనపై తానే హైప్‌ పెంచుకున్న అరియానా సైతం అంచనాలను అందుకోలేకపోయింది. టీవీల్లో దుమ్మురేపే దేవి నాగవల్లి, సుజాతలు సో.. సో మనిపిస్తున్నారు. మధ్యలో వచ్చిన కుమార్‌ సాయి తన రేంజ్‌లో ఆకట్టుకోలేకపోతున్నాడు. దేత్తడి హారిక కొద్దిగా నెట్టుకొస్తుంది. సోహైల్‌ స్టార్టింగ్‌లో మెరిపించినా ఇప్పుడు హీట్‌ తగ్గింది. 

లాస్య లీడర్‌గా మారి.. ఎంటర్‌టైన్‌ చేయడంతో వెనకబడుతుంది. నోయల్‌ తన శక్తిమేరకు సందడి చేస్తున్నాడు. ఇలా కంటెస్టెంట్స్ ఆశించిన స్థాయిలో వినోదాన్నిపంచడంలో,  తమ రియాలిటీని చూపించడంలో వెనకబడుతున్నారు. 

ఇదంతా ఓ ఎత్తైతే.. బిగ్‌బాస్‌ అంటేనే చాలా సహజత్వంగా ఉండటం, తమ యాటిట్యూడ్‌ చూపించడం. ఇక్కడ ప్రధానంగా అదే లోపించింది. ఎక్కువ వివాదాలు క్రియేట్‌ చేస్తే ఆడియెన్స్ ఎంటర్‌టైన్‌ అవుతారు. దానిపై ఫోకస్‌ పెరుగుతుంది. ఎంగేస్‌ చేస్తుంది. కానీ ఈసారి అదే తగ్గింది. పైగా ప్రతి ఒక్కరు కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నట్టుగానే ఉంది తప్ప వారిలో సహజత్వం కనిపించడం లేదు. 

ఇలా మొత్తంగా బిగ్‌బాస్ సీజన్‌4 ఇప్పటి వరకు అంతా సో.. సోగానే, బోరింగ్‌గానే సాగుతుంది. నెవర్‌ బిఫోర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కి అసలు ఛాన్సే లేదని నెటిజన్లు, ఫ్యామిలీ ఆడియెన్స్ పెదవి విరుస్తున్నారు. ఇంకా ఏదో కావాలంటున్నారు. మరి ఇక ముందైనా షోని రక్తికట్టిస్తారేమో చూడాలి.