కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమను గాడిలో పెట్టేందుకు సినీ పెద్దలు శ్రమిస్తున్నారు. లాక్‌ డౌన్‌ 4లో చాలా పరిశ్రమలకు వెసలుబాట్లు కల్పించటంతో సినీ ప్రముఖులు కూడా తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గురువారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలతో పాటు తెలంగాణ రాష్ట్రా సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇప్పటికే ఇండస్ట్రీ వందల కోట్లు నష్టపోయిందని పరిస్థితి ఇలాగే కొనసాగితే దాదాపు 14 వేల కుటుంబాలు రోడ్డు పడతాయని చిరంజీవి మంత్రికి తెలియజేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించినట్టుగా తెలుస్తోంది. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు తలసాని. అయితే తాజా చర్చల్లో షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్‌కు సంబంధించిన అనుమతుల విషయంలో ప్రధానంగా చర్చజరిగినట్టుగా తెలుస్తోంది.

పరిశ్రమలోని అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సినిమా ప్రొడక్షన్,  పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకునేందుకు, సినిమా థియేటర్ లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు. లాక్ డౌన్ సమయంలో షూటింగ్ లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో వివరిస్తూ అవుట్ డోర్, ఇండోర్ షూటింగ్ లకు సంబంధించిన మాక్ వీడియో ను ప్రభుత్వానికి సమర్పిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు సినీ పెద్దలు వివరించారు.

షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్న తలసాని, నిర్మాణానంతర కార్యక్రమాలకు అనుమతిస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిపారు. అయితే పని ప్రదేశాల్లో తప్పని సరిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్క్ లను ధరించాలని, శానిటైజేషన్ ఉపయోగించాలని, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మాక్ షూటింగ్ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. షూటింగ్ ల నిర్వహణకు, థియేటర్ లను తెరిచేందుకు ముఖ్యమంత్రి తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.