కరోనా లాక్‌ డౌన్‌ ప్రభావం సినీ పరిశ్రమ మీద తీవ్ర స్థాయిలో ఉంది. ఈ పరిస్థితుల కారణంగా తెలుగు సినీ పరిశ్రమ కూడా తీవ్ర స్థాయిలో ఎఫెక్ట్‌ అయ్యింది. షూటింగ్ లు నిలిచిపోవటంతో నిర్మాతలకు భారీ నష్టాలు తప్పటం లేదు. చాలా సినిమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ గా ఉన్నాయి. మరికొన్ని సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఇంకొన్ని సినిమాలు నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్నాయి. అయితే ఈ పనులన్ని ఆగిపోవటంతో లక్షలాది మంది కార్మికులకు పనిలేకుండా పోయింది. అయితే ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు సినీ పెద్దలు నడుం బిగించారు.

ఇప్పటికే ఉపాది కోల్పోయిన కార్మికులను ఆదుకునేందుకు సీసీసీని స్థాపించిన చిరు, ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కూడా ముందుకు వచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు లాక్‌ డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వటంతో సినీ రంగానికి కూడా కొంత మేరకు వెసలు బాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలు సమావేశం అవుతున్నారు. ఈ మీటింగ్‌లో చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, దిల్‌ రాజు లాంటి వారు పాల్గొంటారని తెలుస్తోంది. ప్రభుత్వం తరపున సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ కూడా పాల్గొంటున్నారు.

అయితే ఈ చర్చలో ప్రధానంగా ఏం అంశాలు చర్చకు రానున్నాయి అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం.. ఇప్పట్లో థియేటర్లు తెరిచే పరిస్థితి లేని నేపథ్యంలో కనీసం పోస్ట్ ప్రొడక్షన్‌ తో పాటు లిమిటెడ్‌ క్రూతో చేసే షూటింగ్‌ లకు కూడా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో షూటింగ్ లకు ఇచ్చే అనుమతి విషయంలో సింగిల్ విండో విదానాన్ని ప్రవేశ పెట్టాలని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మీటింగ్‌ పై పూర్తి వివరాలు మరికాసేపట్లో తెలిసే అవకావం ఉంది.