తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే అన్నట్లు హీరో..హీరోనే...రూల్స్ రూల్సే..పాటించాల్సిందే  అని అభిమానులు మండిపడుతున్నారు. తమ  హీరో ఈ రూల్స్ ను తుంగ‌లో తుక్కాడంటూ ఫ్యాన్స్ విరుచుకుప‌డుతున్నారు. అంద‌రికీ ఆద‌ర్శంగా ఉండాల్సిన సెల‌బ్రిటీలే ఇలాంటి త‌ప్పు చేసి సొసైటీకి ఏం సందేశం ఇస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది ...ఏ విషయం గురించి అంటే...

విష‌యానికొస్తే బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో క‌రోనా వైర‌స్‌ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్న ఓ పోలీసుకు చిరున‌వ్వుతో షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నెటిజ‌న్లు పెద్ద ఎత్తున అత‌నిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

"మాస్క్‌ క‌ట్టుకోలేదు, గ్ల‌వ్స్ ధ‌రించ‌లేదు, సామాజిక దూరం పాటించ‌లేదు, పైగా కొంచెం కూడా బుద్ధి లేకుండా పోలీసు అధికారికి షేక్ హ్యాండ్ ఇస్తూ అత‌ని ప్రాణాన్ని ప్ర‌మాదంలోకి నెడుతున్నావు. మీరు ఇదేనా అభిమానుల‌కు ఇచ్చే సందేశం?" అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 దీనిపై స్పందించిన హీరో ఇడియ‌ట్, అది రెండు నెల‌ల క్రితం దిగిన ఫొటో అని స‌మాధాన‌‌మిచ్చారు. ఇదిలా ఉండ‌గా వ‌రుణ్ ప్ర‌స్తుతం కూలీ నెంబ‌ర్‌1 సినిమాలో న‌టించ‌నుండ‌గా, అత‌నితో హీరోయిన్ సారా అలీఖాన్ జోడీ క‌ట్ట‌నుంది.

మరో ప్రక్క అమెరికాలో ఉంటున్న తన బంధువులకు కరోనా సోకిందని బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ తెలిపారు. తాజాగా ఆయన ఇన్‌స్టా లైవ్‌ వేదికగా తన అభిమానులతో ముచ్చటించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మరికొంతకాలం ఇంట్లోనే ఉండమని నెటిజన్లకు సూచించారు.

‘అమెరికాలో ఉంటున్న మా బంధువులకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు  డాక్టర్లు నిర్ధారించారు. మా కుటుంబానికి వారు అత్యంత సన్నిహితులు. మీకు తెలిసిన వారికే ఇలాంటివి జరిగే వరకూ మీరు ఏదీ కూడా కఠినంగా తీసుకోరు. ఆ మహమ్మారి ప్రభావం గురించి తక్కువ అంచనా వేస్తారు. అర్థం చేసుకోండి.. ఇప్పటికైనా ఇంట్లోనే ఉండండి. తగిన జాగ్రత్తలు పాటించండి. అలాగే సామాజిక దూరం పాటించి కరోనా కట్టడిలో భాగంకండి.’ అని వరుణ్‌ పేర్కొన్నారు.