టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చాలా కాలం క్రితమే ఈ కాంబినేషన్‌ను సెట్ చేస్తూ నిర్మాత అడ్వాన్సులు ఇచ్చిన ఇంత వరకు ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. రాజమౌళి ఐదేళ్ల పాటు బాహుబలి షూటింగ్‌లోనే ఉండిపోవటంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. తరువాత మహేష్ బిజీగా ఉండటంతో రాజమౌళి మరో భారీ ప్రాజెక్ట్‌ ఆర్ ఆర్ ఆర్‌ను ప్రారంభించాడు. దీంతో మహేష్ రాజమౌళిల సినిమా మరోసారి వాయిదా పడింది. అయితే ఇటీవల మీడియా ఇంటర్య్వూలలో పాల్గొన్న రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ మహేష్‌తోనే అని క్లారిటీ ఇచ్చాడు.

ఈ నేపథ్యంలో రాజమౌళితో మహేష్ చేయబోయే సినిమా ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి నెలకొంది. కొంత అభిమానులు ఇప్పటికే మహేష్‌, రాజమౌళిల కాంబినేషన్‌లో జేమ్స్‌ బాండ్‌ తరహా సినిమా వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. మరికొంత మంది అభిమానులు పౌరాణిక చిత్రమైతే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఫ్యాన్‌ మేడ్ పోస్టర్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓ అభిమాని మహేష్ బాబును రాముడిగా మార్ఫ్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రామాయణం అనే టైటిల్‌లో డిజైన్‌ చేసిన ఈ పోస్టర్‌లో దర్శకుడిగా ఎస్ ఎస్‌ రాజమౌళి పేరు ఉంది. దీంతో అభిమానులు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఈ తరహా సినిమా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి జక్కన్న మనసులో ఏముందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ బిజీగా ఉన్నారు రాజమౌళి. లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి. మహేష్ కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించలేదు. ఈ క్రేజీ కాంబినేషన్‌ పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.