ఫహద్ ఫాజిల్ ‘మాలిక్’ రివ్యూ
ఫాహద్ ఫాజిల్ నుంచి వచ్చిన కొత్త చిత్రమే మాలిక్. ఈ మూవీ ఈ రోజు (జూలై 15) అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ
అలీ అహ్మద్ సులేమాన్ మాలిక్ (ఫహద్ ఫాజిల్) జీవిత కథగా ఈ సినిమా మనకు కనపడుతుంది. కేరళలోని ఓ కోస్టల్ గ్రామంలో విప్లవ భావాలు ఉన్న ఓ లీడర్ కథ ఇది. తిరువనంతపురం జిల్లా తీర గ్రామం రామడపల్లి లో కథ ఓపెన్ అయితే...బంధువుల ,స్నేహితులు హడావిడి మధ్య హజ్ యాత్రకు బయలుదేరుతాడు సులైమాన్ అలీ అహమ్మద్ . అయితే ఎయిర్‌పోర్ట్‌లోనే సులేమాన్ నిను పోలీసులు అరెస్ట్ చేస్తారు. చూస్తే పెద్ద మనిషిలా ఉన్నాడు. అంతమంది అభిమానులు ఉన్నారు. ఇదేంటి ఇలా జరిగింది అనుకునే లోపల..గతంలో జరిగిన ఓ హత్య కేసుతో పాటు మరికొన్ని నేరాల కింద కేసులు నమోదు టాడా యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేసి ఆయన్ని జైళ్లో పెడతారు. అంతేకాదు సపోర్ట్ గా ఉంటుందేమో అనుకుంటే సులేమాన్ తల్లి అప్రూవర్‌గా మారిపోయి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు ముందుకొస్తుంది. భార్య రోస్లిన్ మాత్రం ఆయన్ని ఎలాగైనా బయటకు తెప్పించే ప్రయత్నం చేస్తుంటుంది. అప్పుడు మనలో ఓ సందేహం..ఈ సులేమాన్ ఎవరు..అతను నిజంగా పెద్ద మనిషా లేక పెద్దమనిషి ముసుగులో ఉన్న క్రిమినలా అని... ఆ ప్రశ్నలకు సమాధానంగా సులేమాన్ గతం మొదలవుతుంది. అతను అక్కడ జనాలకు మాలిక్ గా ఎలా ఎదిగాడు. మాలిక్‌గా మారే క్రమంలో అతడు ఏం కొల్పోయాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇదీ స్క్రిప్టు మ్యాటర్
కొన్ని సినిమాలు అంతకు ముందు చూసినట్లు అనిపిస్తాయి. కానీ చూస్తూనే ఉండిపోతాం. అది మళ్లీ మళ్లీ తెరపై రిపీట్ అయ్యే కాన్సెప్టుతో సమస్య కావచ్చు. అలాంటి కాన్సెప్టు ని కూడా కళ్లు తిప్పకుండా చూపించే సత్తా ఉన్న డైరక్టర్ నైపుణ్యం కావచ్చు. అయితే అలాంటివి మ్యాజిక్ లు ఎప్పుడో కానీ జరగవు. లేకపోతే గాడ్ ఫాధర్, మణిరత్నం నాయకుడు చూసిన కళ్ళతోనే ‘మాలిక్’ ని చూస్తే..ఏముంది..ఇంతకు ముందు చూసిన కంటెంటే కదా అనిపిస్తుంది. కానీ చివరి దాకా చూడగలగటం మన గొప్పతనం కాదు..ఆ డైరక్టర్,నటుడు ప్రతిభ అని అర్దమవుతుంది. సినిమా క్రాఫ్ట్ పై అమోఘమైన పట్టు ఉన్న దర్శకులకే ఇది సాధ్యం అనిపిస్తుంది. అలాంటి సినిమానే ఇది. మళయాళ డైలాగులతో అక్కడక్కడా ఆగి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసినా బ్యూటీ మిస్సవదు.
స్లో నేరేషన్ నడిచినా సరేలే అని ఎడ్జస్ట్ అవ్వబుద్దేస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే విషయంలోనూ డైరక్టర్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫోర్త్ బ్యాక్, కాసేపు ఫ్లాష్ బ్యాక్, ఇంకాసేపు ప్రస్తుతం అన్నట్టుగా అదే కథని మార్చి మార్చి చూపించి సినిమాపై ఆసక్తి పెంచుతాడు. ఈ నేరేషన్ పూర్తి రిస్క్ తో కూడుకున్నదే. ఏ మాత్రం తేడా కొట్టినా అర్ద కాకో,కన్ఫూజ్ అయ్యో విసుగొచ్చేస్తుంది. అలాగే క్లైమాక్స్‌లో ట్విస్ట్ కూడా బాగుంది. కథలో భాగంగా మత ఘర్షణలు, ప్రభుత్వం, పొలిటీషియన్స్ ఆడే గేమ్స్ ఎలా ఉంటాయో చూపించారు. అవన్నీ చాలా భాగం మనకు తెలుసున్నవే అయినా ..నిజమే కదా అనిపిస్తాయి. అయితే లెంగ్త్ విషయంలో కాస్త కత్తిరింపులు వేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
డైరక్టరే ఎడిటర్ అవటంతో మమకారం చంపుకోలేక కొన్ని సీన్స్ సాగినా వాటిని అలాగే వదిలేసాడు. అలాగే కొత్తదనం కంటెంట్ లో తీసుకొస్తే బాగుండేది..ఎక్కవగా మేకింగ్ మీద, నేరేషన్ మీద దృష్టి పెట్టారు. దాంతో కమల్ నాయకుడు మళ్లీ చూస్తున్నామా అని కొన్ని సార్లు అనిపిస్తుంది. అయితే నాయకుడు వచ్చి చాలా కాలం అవ్వటం..ఈ జనరేషన్ లో చాలా తక్కువ మంది ఆ క్లాసిక్స్ ని చూడటం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. ఏదైమైనా ఇంత బాగా తీసినా,గాడ్ ఫాధర్ తాను ముక్కే అనిపించటం కాస్త బాధ వస్తుంది. అయితే ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ వాస్తవికత. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సీన్స్ లో అది మనకు బాగా కనిపిస్తుంది.
టెక్నికల్ గా..
ఈ సినిమా దర్శకుడు మహేశ్ నారాయణన్ ...గతంలో తీసిన ‘సీయూ సూన్’ చూస్తే అతను ఎంత టెక్నికల్ గా అప్డేట్ గా ఉంటారో అర్దమవుతుంది. అదే ఈ సినిమాలోనూ రిపీట్ చేసారు. సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ మాములు టాలెంట్ చూపెట్టలేదు. సింగిల్ టేక్ లో దాదాపు 10 నిముషాలు పైగా ఉన్న సీన్స్ ని తీసారు. అలాగే ఇలాంటి సినిమాలకు అవసరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజిలో ఇచ్చాడు సుషిన్ శ్యామ్ . పాటలు బాగోలేదు. అలాగే ఈ సినిమా మూడు కాలాల్లో జరుగుతుంది. ఎక్కడా మనకు ఇబ్బంది అనిపించదు. అంటే కాస్ట్యూమ్ డిజైనర్, ఆర్ట్ డైరక్టర్ ఎంత కష్టపడ్డారో అనిపిస్తుంది. డైరక్టర్ తెలిసిన కథనే తన స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ తో ఎంతో బాగా నేరేట్ చేసారు.
నటీనటుల్లో ఫహద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు. అతను ప్రూవ్డ్ ఆర్టిస్ట్. చాలా చోట్ల కేవలం ఎక్సప్రెషన్స్ తోనే సినిమాని లాగేసాడు. మరికొన్ని చోట్ల కమల్ హాసన్ కనిపించాడు. సనల్ అమన్, డాక్టర్ షెర్మిన్‌గా పార్వతీ కృష్ణన్, కలెక్టర్‌గా జోజూ జార్జ్ ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యారు. ముఖ్యంగా డేవిడ్ పాత్రలో వినయ్..ఫాజిల్ కు పోటీ ఇచ్చాడనే చెప్పాలి.
ఫైనల్ థాట్
మాలిక్ కు నానార్దాలలో ఒకటి 'నాయకుడు'
Rating:3
--సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎవరెవరు..
నిర్మాణ సంస్థ: ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ;
నటీనటులు: ఫహద్ ఫాజిల్, నిమిషా సజయన్, వినయ్ ఫోర్రట్, జోజూ జార్జ్, దిలీష్ పోతన్, ఇంద్రాన్స్, పార్వతి కృష్ణ, సనల్ అమన్ తదితరులు
సంగీతం: సుషిన్ శ్యామ్;
సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్;
ఎడిటింగ్: మహేశ్ నారాయణన్;
నిర్మాత: ఆంటో జోసెఫ్;
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేశ్ నారాయణన్;
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
తేదీ: 15-07-2021
రన్ టైం: 2గంటల 40 నిమిషాలు