గోపీచంద్ హీరోగా 'తిరు' దర్శకత్వంలో రూపొందిన 'చాణక్య' .. ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, జరీన్ ఖాన్ కీలకమైన పాత్రను పోషించింది.  ఈ సినిమా అనీఫిషియల్ గా సల్మాన్ ఖాన్ నటించిన ఏక్తా టైగర్ చిత్రానికి రీమేక్ అని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజం కాదంటూ దర్శకుడు తిరు కొట్టి పారేసారు.

దర్శకుడు తిరు మాట్లాడుతూ...మా సినిమాని సల్మాన్‌ ఖాన్‌ ‘ఏక్తా టైగర్‌’ చిత్రంతో పోల్చుతున్నారు. నిజానికి ఇది కొత్త కథ, సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే రాసుకోవడానికి ముందు కొన్ని గూఢచారి సంస్థలైన ‘ఐ ఎస్‌ఐ, సీఐఏ, రా’ వంటి వాటి గురించి బాగా చదివాను. స్పై ఏజెంట్స్‌ ఎలా ఉంటారు? వారి బాడీ లాంగ్వేజ్‌ ఏంటి? ఇలాంటి చాలా విషయాలపై రీసెర్చ్ చేసి కథ రాసుకున్నా. ఓ రకంగా ఈ సినిమా చేయడానికి రవీంద్ర అనే ఒక స్పై నాకు స్ఫూర్తి.

వాస్తవికతకు దగ్గరగా, వాణిజ్య అంశాలు మిస్‌ కాకుండా తెరకెక్కించాను. రా ఏజెంట్‌ చూసినా సంతప్తి పడేలా ఈ చిత్రం ఉంటుంది అన్నారు.  విభిన్నమైన కథాకథనాలతో .. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు  ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. అనిల్ సుంకర ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేని   గోపీచంద్, ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందని భావిస్తున్నాడు.