అర్జున్ రెడ్డి చిత్రంలో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించారు. తక్కువ బడ్జెట్ లో సందీప్ వంగా తెరకెక్కించిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. హిందీలో అర్జున్ రెడ్డి చిత్రం కబీర్ సింగ్ గా రీమేక్ అయింది. కబీర్ సింగ్ కూడా విజయఢంకా మోగించింది. 

టిక్ టాక్ స్టార్ అశ్విని కుమార్ ఈ చిత్ర ప్రేరణతోనే తన ప్రేయసిని హత్యచేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. టిక్ టాక్ స్టార్ అశ్విని కుమార్ ఫ్లయిట్ అటెండెంట్ అయిన నిఖిత శర్మని ప్రేమించాడు. త్వరలో ఆమెకు మరో వ్యక్తితో వివాహం కాబోతోందని తెలిసి జీర్ణించుకోలేకపోయాడు. ఇటీవల ఆమెని హత్య చేసిన సంగతి తెలిసిందే. 

ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు. కబీర్ సింగ్ చిత్ర ప్రేరణతోనే అతడు నిఖితని హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు తనని అరెస్ట్ చేస్తారని తెలిసి అశ్విని కుమార్ కూడా  ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి సెల్ ఫోన్ లో 'ఆమె నాకు దక్కకుంటే.. మరొకరికి దక్కకూడదు' అని కబీర్ సింగ్ చిత్రంలోని డైలాగులు ఉన్నాయి. 

ఈ ఘటనపై దర్శకుడు సందీప్ వంగా స్పందించారు. నిఖిత శర్మకు జరిగిన అన్యాయం చాలా బాధ కలిగించింది. ఆమె కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. ఇతరులని హత్య చేయమని పోత్సహించేలా నా సినిమాలు ఎప్పుడూ ఉండవు. అర్జున్ రెడ్డిలో కూడా అలాంటి సన్నివేశాలు లేవు అని సందీప్ వంగా అభిప్రాయపడ్డారు.