హీరోయిన్ పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. గదిలో తనను అనురాగ్ బలవంతం చేయబోయాడని, ఆ దర్శకుడు ముసుగులో ఉన్న చెడ్డవాడ్ని బయటికి లాగాలని, శిక్షించాలని పాయల్ ఘోష్ ఏకంగా పీఎం మోడీని ట్విట్టర్ ద్వారా కోరడం సంచలనంగా మారింది. కాగా పాయల్ లైంగిక ఆరోపణలకు దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు.  ఆమె ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 

అనురాగ్ తన ట్వీట్ లో 'భేష్ నన్ను సైలెంట్ చేయడానికి నీకు చాలా కాలమే పట్టింది. ఇప్పటికే చాలా అబద్దాలు చెప్పావ్, ఓ మహిళవు అయ్యుండి మరో మహిళను ఈ వివాదంలోకి లాగావు. కొంచెం గౌవరంగా ప్రవర్తించండి మేడం. నీ ఆరోపణలు నిరాధారం.' అని ట్వీట్ చేశారు.  ఇంకా ఆయన తన ట్వీట్ లో 'నన్ను అభాసుపాలు చేసే క్రమంలో నీవు బచ్చన్ ఫ్యామిలీని, నాతో పనిచేసిన నటులను కూడా ఇరికించే ప్రయత్నం చేశావ్, కానీ నువ్వు ఫెయిల్ అయ్యావు. నేను రెండు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పైతే నేను ఒప్పుకుంటా, కానీ నేను నా ఇద్దరు భార్యలను ప్రేమించాను, అలాగే నా లవర్ ని, నాతో పని చేసిన మహిళలను ప్రేమించాను'  అని పొందుపరిచారు. 

తన ట్వీట్స్ కొనసాగిస్తూ...'నేను అలాంటి లైంగిక దాడులు చేయను, అలా చేసినవారిని సహించను. ఏమి జరుగుతుందో చూద్దాం. నీ కోసం నా ప్రేమ, ప్రార్ధనలు. మీ ఇంగ్లీష్ ట్వీట్ కి హిందీలో ఆన్సర్ ఇచ్చినందుకు క్షమాపణలు' అన్నారు. పాయల్ చేస్తున్న ఆరోపణలలో అసలు ఎటువంటి నిజం లేదని అనురాగ్ కశ్యప్ తన ట్వీట్స్ ద్వారా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.