గత వారం రోజులుగా మళయాల సినీ పరిశ్రమను కుదిపేస్తున్న సూపర్ స్టార్ దిలీప్ అరెస్ట్ అనేక మలుపులు తిరుగుతోంది. మలయాళ సినీ పరిశ్రమ అనగానే అందరికీ మోహన్ లాల్, మమ్ముట్టిలే గుర్తుకొస్తారు. అక్కడ తిరుగులేని స్టార్లుగా వెలుగొందుతున్న ఈ మెగా స్టార్లు దక్షిణాదికే కాక దేశమంతా మంచి గుర్తింపు ఉన్న నటులే. తెలుగు.. తమిళ భాషల్లోనూ ఆ ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా ఓ నటుడి చేతిలో కీలుబొమ్మలని అంటున్నాడు మలయాళ దర్శకుడు వినయన్. ఆ నటుడు మరెవరో కాదు.. ఓ స్టార్ నటి కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన దిలీప్ అని వినయన్ ఆరోపణ.

 

మాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన వినయన్.. కొన్నేళ్ల నుంచి లైమ్ లైట్లో లేకుండా పోయాడు. ఐతే తన కెరీర్ నాశనం కావడానికి కారణం దిలీపే అని చెప్పాడు. అతనో పెద్ద మ్యానుపులేటర్ అని.. మొత్తం మలయాళ ఇండస్ట్రీని తన గుప్పెట్లో పెట్టుకున్నాడని వినయన్ ఆరోపించాడు. మోహన్ లాల్, మమ్ముట్టిలకు ఎంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ వాళ్లను కూడా దిలీప్ తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని వినయన్ అన్నాడు. 
 

దిలీప్ ఓ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసకుని.. తర్వాత ఆ చిత్ర నిర్మాతకు హ్యాండిచ్చాడని.. దీంతో దర్శక నిర్మాతల సంఘం వ్యవస్థాపకుడి హోదాలో దిలీప్ ను హెచ్చరించానని.. దీంతో అతను ‘నువ్వు ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తా’ అంటూ సవాల్ విసిరాడని.. అన్నట్లే తన కెరీర్‌ను దెబ్బ తీశాడని వినయన్ చెప్పుకొచ్చాడు.