వరసపెట్టి ప్రతీ శుక్రవారం చిన్నో, పెద్దో ఏదో ఒకటి రిలీజ్ అవ్వటం ఆగింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అంతా తలక్రిందులైపోయింది.  ఇప్పటికీ థియోటర్స్ ఎప్పుడు తెరుస్తారో, జనం చూడటానికి వస్తారో లేదో క్లారిటీ లేదు. ఈ నేపధ్యంలో చాలా మంది తమ సినిమాలను ఓటీటిలకు ఇచ్చేస్తున్నారు. ఈ నేపధ్యంలో 'వి' సినిమా రిలీజ్ పరిస్దితి ఏమిటనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా చాలా మంది సినిమావాళ్ళకు డిస్కషన్ పాయింట్ గా మారింది. నిజానికి డబ్బు పెట్టిన దిల్ రాజు కూడా అంత వర్రీ అవుతున్నారో లేదో కానీ సినీ జనం మాత్రం ఈ సినిమాని ఓటీటికు ఇస్తారా...డైరక్ట్ రిలీజ్ చేస్తారా అనేది పందేలు కాసుకునే స్దాయిలో చర్చలు చేసేస్తున్నారు. ఇంతకీ 'వి' సినిమా ని దిల్ రాజు ఏం చెయ్యబోతున్నారు..

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 'వి' సినిమా ని థియోటర్ లోనే రిలీజ్ చేద్దామనేది హీరో నాని, డైరక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆలోచన. కానీ దిల్ రాజు ని మాత్రం ఓటీటి వాళ్లు వదలటం లేదట. ఆగస్ట్ దాకా ఆగి, అప్పుడు రిలీజ్ చేస్తే ...జనం రాకపోతే పరిస్దితి ఏమిటి,జనం కరోనాకు భయపడకుండా థియోటర్స్ కు రావాలంటే కొంత టైమ్ పడుతుంది. అప్పుడు దాకా ఆగగలమా అనేది దిల్ రాజు ముందు ఉన్న ప్రశ్న. అయితే దీన్ని ఆసరా చేసుకుని ఓటీటి వాళ్లు టెమ్టింగ్ ఆఫర్స్ ఇస్తున్నారట. కానీ అవేమీ కలిసొచ్చేవి కావని, లాభాలు తెచ్చిపెట్టేవి కాదట. పెట్టిన పెట్టుబడి రికవరీ మాత్రమేనట. 

దాంతో దిల్ రాజు..వాళ్లను..మీరు నేను కాదనలేను అనిపించేటంత ఆఫర్ తో వస్తే ఖచ్చితంగా సినిమా ఇస్తాను అని చెప్పినట్లు సమాచారం. మరి దిల్ రాజు కాదనలేని ఆఫర్ అంటే ఎంత మొత్తం ఇది ఓటీటివాళ్లను ఆలోచనలో పడేసింది. అంతే కాక మరో ఓటీటీ వారికి అయితే ..వి సినిమాలో సగం సినిమా ఇస్తానని, ఆ సగం ఓటిటీ వ్యూయర్స్ ఎలాగో చూస్తారని, అయితే మిగతా సగం చూసేందుకు థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తారని దిల్ రాజు చెప్పడంతో వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యిపోయిందిట.నిజానికి ఓటీటీల నుంచి వచ్చే ప్రెజర్ తగ్గుతుందని దిల్ రాజు అలా చెప్పారంటున్నారు. ఆయనకు మనస్పూర్తిగా సినిమా ఓటీటికు ఇవ్వాలని లేదట. సినిమా బాగా వచ్చింది. పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారట. 
 
నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ముఖ్యపాత్రల్లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో 'వి' అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ‘అష్టాచెమ్మా’ ‘జెంటిల్మెన్’ సినిమాల తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ, నాని  వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసాడు. ఈ చిత్రంలో నాని గడ్డంతో రఫ్‌ లుక్‌తో అదరగొడుతున్నాడు.  తన తొలి రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో నాని ఆవిష్క‌రిస్తున్నాడు.