కరోనా దెబ్బకు సినీ పరిశ్రమ మొత్తం స్టక్ అయ్యిపోయింది. అయితే షూటింగ్ లు మొదలై, థియోటర్స్ ఓపెన్ చేస్తే మళ్లీ యధాస్దితికి వస్తుందని అంతా భావించారు. అయితే ఇప్పుడు పరిస్దితి మరీ చేయి దాటిపోయింది. బిజినెస్ వైపు నుంచి సమస్యలు మొదలవుతున్నాయి. గతంలో లాగ ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఎన్ ఆర్ ఎ పద్దతిలో సినిమాలు తీసుకోవటానికి ఉత్సాహం చూపించే పరిస్దితి కనపడటం లేదు. ఎందుకంటే సినిమా రిలీజ్ తర్వాత ఏ మేరకు కలెక్షన్స్ వస్తాయో తెలియటం లేదు. ఎక్కువ నష్టాలే కనపడుతున్నాయి కళ్లకి. ఈ నేపధ్యంలో  ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దిల్ రాజు ఇక డిస్ట్రిబ్యూటర్ గా ఏ సినిమాని ఒక సంవత్సరం వరకూ కొనరు. ఆయన సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కానీ ప్రాఫిట్ షేరింగ్ పద్దతిన సినిమాలు పంపిణీ చేయనున్నారు. దాంతో పెద్ద సినిమాలకు ఇది పెద్ద దెబ్బగా మారనుంది. ఇన్నాళ్లూ చిన్న సినిమాలకు ఈ పద్దతిని పాటించేవారు. ఈ ప్రాఫిట్- షేరింగ్ పద్దతిలో డిస్ట్రిబ్యూటర్ నష్టపోయేది పెద్దగా ఉండదు. ఏమన్నా లాభం వస్తే పంచుకుంటారు. లేదా చేతులెత్తేయటమే. గతంలో దిల్ రాజు వంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్స్..ఓ భారీ బడ్జెట్ సినిమా వస్తోంది, లేదా స్టార్ హీరో సినిమా మొదలైంది అంటే అడ్వాన్స్ ఇచ్చి ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకునేవారు. ఇప్పుడా పద్దతి కనపడే విధానం లేదు. ఓ రకంగా నిర్మాతకి లాభం..మరో విధంలో నిర్మాతకు పెద్ద రిస్క్. అంటే డిస్ట్రిబ్యూటర్ తీసుకునే రిస్క్ మొత్తం నిర్మాతకు ట్రాన్సఫర్ అవబోతోందన్నమాట.  

అందుకు ఏకైక కారణం దిల్ రాజు డబ్బు చాలా ప్రాజెక్టులలో స్టక్ అవటమే. దిల్ రాజు నిర్మించిన నాని,సుధీర్ బాబు కాంబినేషన్ లో రూపొందిన వి సినిమాని మార్చి 25న విడుదల చేద్దామనుకున్నార. కాని ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో తెలియటం లేదు. అది రిలీజ్ కావాలి. అందులో పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలి. అలాగే పవన్ తో తీస్తున్న వకీల్ సాబ్ సినిమా సైతం మే 15 న రిలీజ్ చేద్దామనుకుంటే ఆ సినిమా రిలీజ్ కూడా తెలియటం లేదు. అలా ఆయన సొమ్ము కొన్ని మిగతా ప్రాజెక్టులపైనా పెట్టుబడిగా ఉండిపోయింది. వీటిన్నటితో పాటు జెర్సీ రీమేక్ ని షాహిద్ కపూర్ తో చేద్దామని అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఆ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. వీటిన్నటితో పాటు ఆర్ ఆర్ ఆర్ చిత్రం నైజాం రైట్స్ కోసం భారీగా అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఆ డబ్బు కూడా స్టక్ అయ్యిపోయింది. 

రోజులు గడుస్తున్న కొద్ది మరీ టైట్ అయ్యిపోతోంది. రొటీషన్ తిరగపోతే సినీ పరిశ్రమలో ఎంత పెద్ద నిర్మాత అయినా వెయిట్ చెయ్యాల్సింది. దాంతో ఈ సమస్యలు అన్ని తీరి తిరిగి డబ్బు రొటేట్ అయ్యే సరికి మినిమం ఒక సంవత్సరం పడుతుందని, అప్పటిదాకా సినిమాలు డబ్బు పెట్టి కొని డిస్ట్రిబ్యూట్ చేయకూడదని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతానికి ఏ కొత్త సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం దిల్ రాజు సంప్రదింపులు చేయటానికి ఆసక్తి చూపటం లేదు. దాంతో ఈ వార్త విన్న చాలా మంది నిర్మాతలు ఆలోచనలో పడిపోయారు. ఈ నిర్ణయం ఇండస్ట్రీకి పెద్ద దెబ్బే అంటున్నారు. ఎందుకంటే మిగతా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇదే పద్దతి ఖచ్చితంగా ఫాలో అవుతారు కాబట్టి.