ధనుష్‌ వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్నారు. తెలుగు డైరెక్టర్స్ కి ఓకే చెబుతున్నారు.ఇప్పటికే ఓ సినిమా చేసిన ఆయన మరో సినిమాకి రెడీ అయ్యారు.ఇప్పుడు కొత్తగా ఇంకో సినిమా చేయబోతున్నారట.  

ధనుష్‌ వరుసగా తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇటీవల వెంకీ అట్లూరితో `సార్‌` సినిమా చేశారు. బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. శేఖర్‌ కమ్ములతో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ధనుష్‌ ఇతర సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో శేఖర్‌ కమ్ముల సినిమా డిలే అవుతుంది. ఈ ఏడాదిలోనే ఇది ప్రారంభం కానుందట. మరోవైపు వంశీపైడిపల్లి ఓ సినిమాకి ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. దీంతోపాటు ఆ జాబితాలో మరో కొత్త దర్శకుడు చేరారు. `నీది నాది ఒకే కథ`, `విరాటపర్వం` చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వేణు ఉడుగుల సైతం ధనుష్‌తో సినిమాకి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. 

అంతేకాదు ఇప్పటికే ధనుష్‌కి స్టోరీ కూడా నెరేట్‌ చేశారట వేణు ఉడుగుల. దీనికి ధనుష్‌ ఇంప్రెస్‌ అయ్యారని సమాచారం. పీరియడికల్‌ డ్రామాగా ఈ స్టోరీ ఉండబోతుందని, ఓ రివల్యూషనరీ లీడర్‌ కథతోనే వేణు ఈ సినిమాని చేయబోతున్నారని సమాచారం. అంతేకాదు ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. అన్ని కుదిరితే ఈ ఏడాది ఎండింగ్‌లోగానీ, వచ్చే ఏడాదిగానీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. 

ఇక ఈ సినిమాని సితార బ్యానర్‌లోగానీ, పీపుల్స్ మీడియాలో గాని తెరకెక్కే అవకాశం ఉంది. ధనుష్‌తో సితార బ్యానర్‌లో ఓ కమిట్‌ మెంట్ ఉందని, అలాగే వేణుతో పీపుల్స్ మీడియాలో కమిట్‌ మెంట్‌ ఉందని, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫైనల్‌ అయ్యే అవకాశం ఉంది, అది ధనుష్‌ నిర్ణయాన్ని బట్టి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉందని, ధనుష్‌ నుంచి ఫైనల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ రావాల్సి ఉందని టాక్‌. 

అయితే వేణు ఉడుగుల చివరగా `విరాటపర్వం` సినిమాని రూపొందించారు. దీనికి విమర్శకుల నుంచి ప్రశంలు దక్కాయి, కానీ కమర్షియల్‌గా ఆడలేదు. ఈ నేపథ్యంలో ఈ కొత్త సినిమాని రియాలిటీ అంశాలకు కమర్షియల్‌ హంగులు మేళవింపుతో తెరకెక్కించాలని వేణు భావిస్తున్నారు. `విరాటపర్వం` నేర్పిన పాఠాలను ఈ చిత్రంలో అప్లై చేయబోతున్నారని, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని ప్లాన్‌ చేస్తున్నాని సమాచారం. దాదాపు 70కోట్లతో పాన్‌ ఇండియా రేంజ్‌లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే వేణు ఉడుగుల.. మొదట నాగచైతన్యతో ఓ సినిమాకి ప్లాన్‌ చేశారు. చాలా రోజులపాటు ఓ కథపై ట్రావెల్‌ చేశారు. కానీ చివరికి చైతూ నో చెప్పినట్టు తెలుస్తుంది. `కస్టడీ` రిజల్ట్ తో నాగచైతన్య దైలమాలో పడ్డారట. దీంతో వేణు ఉడుగుల కథని పక్కన పెట్టినట్టు సమాచారం. మరి ధనుష్‌కి చెప్పిన కథ అదేనా, ఇది వేరేనా? వంటి విషయాలు తెలియాల్సి ఉంది.