ధనుష్ ‘జగమే తంత్రం’ రివ్యూ
ధనుష్, కార్తిక్‌సుబ్బరాజుల కలయికలో వస్తున్న చిత్రం కావడం, మరోసారి ధనుష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్‌లతో సినిమాపై విడుదలకు ముందే భారీ క్రేజ్ ఏర్పడింది.
ధనుష్ వంటి స్టార్ హీరో సినిమా డైరక్ట్ ఓటిటిలో రిలీజ్ అవుతోంది అంటే ఖచ్చితంగా ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ ‘పుదుపెట్టై’, ‘వడాచెన్నై’, ‘మారి’ లాంటి సినిమాల్లో లోకల్ డాన్‌గా నటించి మెప్పించిన ధనుష్. ఇందులో ఇంటర్నేషనల్ డాన్‌గా అవతారమెత్తటం మరో ఆసక్తికరమైన విషయం.ట్రైలర్ లో ..లండన్ వీధుల్లో చెలరేగిపోయే తమిళ డాన్‌గా ధనుష్ కనిపించాడు. ఈ నేపధ్యంలో సినిమాపై భారీగా పెరిగిన అంచనాలను ఈ సినిమా రీచ్ అయ్యిందా...అసలు సినిమా కథేంటి..తెలుగు వాళ్లకు నచ్చే కథేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
తమిళనాడు మధురై ప్రాంతానికి చెందిన సురలీ (ధనుష్) అక్కడ ఓ ఫ్యాక్షన్ గ్రూప్ లో కీలక వ్యక్తిగా ఉంటూంటాడు. ట్రైన్ ని ఆపి మర్డర్స్ చేసే స్దాయిలో ఉన్న అతను ఓ నెల రోజులు పాటు అక్కడ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తున్న టైమ్ లో అతనికి లండన్ నుంచి ఓ ఆఫర్ వస్తుంది. లండన్ నుంచి పీటర్ (జేమ్స్ కాస్మో)మనిషి వచ్చి అతనికో ఆఫర్ ఇస్తాడు. లండన్ లో తమకు ప్రత్యర్దిగా ఉన్న శివదాసు(జోజు జార్జ్) తప్పించటానికి సురలీ సాయిం కోరుతారు. అందుకోసం సురలీ అడిగిన పెద్ద మొత్తం ఇవ్వటానికి రెడి అయ్యి లండన్ తీసుకెళ్తారు.
ఆ ప్రపోజల్ కు కమిటయ్యి లండన్ వెళ్లిన సురలీ ...శివదాసు గురించి పూర్తి వివరాలు సేకరించి ఎటాక్ లు చేయటం మొదలెడతాడు. అంతేకాకుండా అక్కడ సింగర్ అఖిల(ఐశ్వర్య లక్ష్మీ)ను చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ప్రేమలో పడిపోతాడు. కొద్ది రోజులుకి ఎత్తుకు పై ఎత్తులు వేసి తను వచ్చిన పని అయిన శివదాసుని చంపేయగలుగుతాడు. అయితే ఆ తర్వాత శివదాసు గురించిన ఓ నిజం తెలుస్తుంది. దాంతో అతన్ని చంపినందుకు సురలీ పశ్చాత్తాపపడతాడు. అక్కడ నుంచి అతని జీవితం మారిపోతుంది. అసలు ఇంతకీ శివదాసు ఎవరు...అతని గురించిన నిజం ఏమిటి..ఈ కథలో సింగర్ అఖిల కథేంటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
సినిమా ఎత్తుగడ ఓ రేంజి యాక్షన్ సీన్స్ తో మొదలెట్టాడు. ఆ తర్వాత ధనుష్ ఎంట్రీ కూడా అలాగే సాగుతుంది. అయితే లండన్ వెళ్లిన దగ్గర నుంచి కథనం దారి తప్పుతుంది. ధనుష్ చేసే పనులకు అడ్డూ అదుపూ లేకుండా స్క్రీన్ ప్లే సాగుతుంది. ఇంకా ఏదో జరుగుతుంది అని ఎదురుచూస్తున్నా కథలో పెద్దగా కదిలిలక రాదు. గ్రూప్ తదాగాలు కొంత టైమ్ అయ్యేసరికి బోర్ కొట్టేస్తాయి.ధనుష్ చేసేది ఏమీ కనపడదు. సర్లే కొంత దూరం వెళ్ళాక శివదాసు చచ్చిపోయాక కథ కదులుతోంది అనుకుంటే ...శివదాసు ప్లాష్ బ్యాక్, హీరోయిన్ సీన్స్ లండన్ లో ఉండే తమిళ శరణార్దులు, శ్రీలంక శరణార్దులు అంటూ టర్న్ తీసుకుంటుంది. హీరోయిన్ ట్రాక్ కూడా అంతంత మాత్రమే. దాంతో కథలో ఎక్కడా సరైన కాంప్లిక్ట్ పాయింట్ అనేది ఉండదు. ధనుష్ ది పూర్తిగా యాక్టివ్ ప్యాసివ్ క్యారక్టర్. యాక్టివ్ గా ఉన్నట్లు కనపడుతుంది కానీ ఆ పాత్ర కథలో కొత్త సంఘటనలు కానీ, మలుపులు కానీ సృష్టించదు. పోనీ కథకు కీలకమైన శరణార్దులు పాయింటైనా త్వరగా వస్తుందా అంటే అదీ లేదు. ఎక్కడో సెకండాఫ్ లో వస్తుంది. అలాగే కథకు కీలకమైన శివదాసు స్మగ్లింగ్ సీక్రెట్స్ అంత సులభంగా తెలుసుకున్న సురులికి అతడి ఫ్లాష్ బ్యాక్ కథ తెలియకపోవడమే కామెడీగా, కొంత సినిమాటిక్‌గా అనిపిస్తుంది
శ్రీలంక శరణార్దుల మీద సానుభూతి ఉండేవాళ్లకు,తమిళ ప్రాంతీయులకు ఆ సీన్స్ నచ్చుతాయేమో కానీ మనకు ఎక్కడం కష్టం. అలాగే హీరోయిన్ క్యారక్టరైజేషన్ కొత్తగా ఫీలవుతాము అనుకుంటారు కానీ ఓ మాదిరి బుర్ర ఉన్నవాడు ఆ పాత్రలో ఉన్న ట్విస్ట్ ని ముందే ఊహించాడు. టోటల్ గా ఇలాంటి స్క్రీన్ ప్లే కథలు చాలా చూసి ఉండటం వల్ల పెద్దగా ఎక్సైటింగ్ గా అనిపించదు. అలాగే ఈ గ్యాంగస్టర్ డ్రామా ఇమ్మిగ్రెంట్ ఇష్యూలఫై ఫోకస్ పెట్టి చేసారు. అయితే అవన్నీ తమిళనాట పుట్టి పెరిగిన వాళ్లకు తెలుసు కదా అనే ధోరణిలో పెద్దగా ఎస్టాబ్లిష్ చేయకుండా వెళ్లిపోయారు.దాంతో అవి మన తెలుగు బుర్రకు ఎక్కడం కష్టమనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే తేలిపోయింది. దర్శకుడు అటు ఓ లోకల్ గ్యాంగస్టర్ లండన్ వెళ్లి ఏం చేసాడు అని చెప్పి ముగించేస్తే ఇబ్బంది లేకపోను. దానికి శరణార్దుల సమస్య కలపటమే సమస్యగా మారిపోయింది.
ఎవరెలా చేసారంటే...
నటుడుగా ధనుష్ కు ఈ పాత్రమీ కొత్త కాదు. గ్యాంగ్‌స్టర్‌గా గతంలో ‘పుదుపెట్టై’, ‘మారి’, ‘వడాచైన్నై’ సినిమాలలో చేసి ఆకట్టుకున్నాడు. ‘జగమే తంత్రం’లో ఇంటర్నేషనల్ డాన్‌గా స్టైలిష్‌గా కనిపించారు. అంతేతేడా. అలాగే అసురన్, కర్ణన్ లాంటి సినిమాల స్దాయి నటన కూడా కాదు.
ఇక హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ క్యారక్టర్ గురించి మాట్లాడుకోవటానికి ఏమీ లేదు. ఎందుకంటే లెంగ్త్ బాగా తక్కువ. ఆ పాత్రలో వచ్చే ట్విస్ట్ కూడా బాగా పాతది. శివదాసుగా జోజు జార్జి, పీటర్ స్ప్రోట్‌గా జేమ్స్ కాస్మో సోసోగా ఉన్నారు.
టెక్నికల్ విషయానికి వస్తే..
ఈ కథ బాగా బోరింగ్ గా ఉన్న ఆ మాత్రం అయినా చూడగలిగాము అంటే సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కారణం అని చెప్పాలి. అయితే నాచురల్ గా జరుగుతున్న ఫీల్ మాత్రం మిస్సైంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లు బిల్డప్ గా బాగున్నాయి కానీ ఇంపాక్ట్ అంతగా లేదు. ఫస్టాఫ్ లో ధనుష్ చేసే ఫన్ వర్కవుట్ అయ్యింది. సెకండాఫ్ లో అదీ లేదు. బాగా డ్రైగా సాగింది. పాటలకు పెద్దగా స్కోప్ లేదు. ఎడిటర్ మాత్ర మరో పావు గంట సినిమా తీసేయచ్చు అనిపించింది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలకు తగినట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఉన్నాయి.
ఫైనల్ థాట్
తమిళ శరణార్దుల గురించి,బై కోర్ అనే చట్టం గురించి తెలుసుకోకుండా సినిమా చూస్తే తలనొప్పే శరణ్యం.
----సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
ఎవరెవరు...
బ్యానర్లు: వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైనర్‌మెంట్
నటీనటులు: ధనుష్, ఐశ్వర్య లక్ష్మీ, జేమ్స్ కాస్మో, జోజు జార్జ్, కలైయరాసన్, బాబా భాస్కర్ తదితరులు
కథ, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు: ఎస్ శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర
మ్యూజిక్: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫి: శ్రేయాస్ కృష్ణ
ఎడిటింగ్: వివేక్ హర్షన్
ఓటీటీ రిలీజ్: నెట్ ఫ్లిక్స్
రన్ టైమ్:2గంటల,37ని
రిలీజ్ డేట్: 2021-06-18