ఓ స్టార్‌ హీరోతో నటించాలని ఉందని హీరోయిన్లు చెప్పడం సర్వసాధారణమే. ఫలానా హీరోతో యాక్ట్ చేయడం తన డ్రీమ్‌ అని పలు ఇంటర్వ్యూలో చెబుతుంటారు. కానీ అది అంత ఈజీగా సాధ్యం కాదు. ఓ అప్‌కమింగ్‌ హీరోయిన్‌కి స్టార్‌ హీరో ఛాన్స్ ఇవ్వడం చాలా తక్కువ సమయంలో జరుగుతుంది. అందుకు చాలా టైమ్‌ పడుతుంది. ఆ హీరోయిన్‌కి ఓ రేంజ్‌ రావాలి. అప్పుడుగానీ హీరోల దృష్టి వాళ్ళపై పడదు. 

కానీ మాళవిక మోహనన్‌ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. కన్నడ, మలయాళ చిత్రాలతో నటిస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న ఈ బ్యూటీ తన కోరికని అలా కోరుకుందో లేదో, ఆ వెంటనే జరిగింది. తాను కోరుకున్న హీరోతో నటించే ఛాన్స్ ని ఇప్పుడు కొట్టేసింది. దీంతో షాక్‌తోపాటు సర్ప్రైజ్‌ అవుతోందీ అమ్మడు. 

 ఇటీవల తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ బర్త్‌ డే జరిగింది. ఈ సందర్భంగా మాళవిక మోహనన్‌ ఆయనకు విశెష్‌ చెబుతూ, మీ సరసన నటించాలని ఉందని పేర్కొంది. ఆ అవకాశం కల్పించి తన కోరికని నెరవేర్చాలని తెలిపింది. ఇంత ఓపెన్‌గా అడగడం అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ వార్త వైరల్‌ అయితే అయ్యిందిగానీ, ఇప్పుడు మాళవికకి మాత్రం లక్కీ ఛాన్స్ వరించింది.  

ధనుష్‌ నెక్ట్స్ కార్తీక్‌ నరేష్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నారు. ఆయన హీరోగా రూపొందుతున్న 43వ చిత్రమిది. ఇందులో హీరోయిన్‌గా మాళవిక మోహనన్‌ని ఎంపిక చేశారట. తన అభిమాన హీరో ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి మాళవిక ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇది నిజమేనా ? కలా? అంటూ గిల్లి మరీ చెక్‌ చేసుకుంటోంది. మొత్తానికి ఆమె కోరికని తీర్చిన ధనుష్‌ని నెటిజన్లు, ఆమె అభిమానులు ప్రశంసిస్తూ.. థ్యాంక్స్ చెబుతున్నారు.

హాట్‌ అందాలతో కుర్రకారుని మంత్రముగ్ధుల్ని చేస్తున్న మాళవిక ప్రస్తుతం విజయ్‌ సరసన `మాస్టర్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తెలుగులో విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందాల్సిన `హీరో`లోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. కానీ ఇది ఆగిపోయిన విషయం తెలిసిందే.