బాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో స్టార్‌ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ వంటి కథానాయికలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ) దీనిపై విచారణ చేపడుతుంది. సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి చెప్పిన ఆధారాల ప్రకారం వీరికి ఎన్సీబీ సమన్లు పంపింది.

దర్యాప్తులో భాగంగా ఇప్పటికే దీపికా మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌ని, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని వంటి తదతరులను ఎన్సీబీ విచారించింది. శనివారం దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారాలను విచారించనుంది. అయితే ఇప్పటికే హీరోయిన్‌ దీపికా ఎన్సీబీ ఎదుట హాజరైంది. ప్రస్తుతం ఆమెని నార్కొటిక్‌ అధికారుల బృందం విచారిస్తోంది. ఆమెపై డ్రగ్స్ కి సంబంధించిన ప్రశ్నల వర్షం కురిపిస్తుందని సమాచారం. 

డ్రగ్స్ కేసులో, రియా చెప్పిన దాన్ని బట్టి ప్రధానంగా దీపికా, ఆమె మేనేజర్‌ కరిష్మా ల మధ్య డ్రగ్స్ కి సంబంధించి వాట్సాప్‌ ఛాటింగ్‌ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. `డీ`, `కే` వంటి కోడ్‌ పదాలతో వీరి మధ్య చాటింగ్‌ జరిగింది. దీనిపై ఎన్సీబీ విచారణ చేపడుతోంది. 

అయితే శుక్రవారం కరిష్మా ఎన్సీబీ ఎదుట హాజరైంది. ఆమెని సుమారు నాలుగు గంటలపాటు అధికారులు విచారించారు. మళ్ళీ ఈ రోజు కూడా ఆమెని విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీపికా విచారణ ముంబయిలోని కొలాబాలోని అపోలో బండర్‌లోని ఎవెలిన్‌ గెస్ట్ హౌజ్‌లో జరుగుతుంది. ఆ తర్వాత శ్రద్ధా, సారాలను బల్లార్డ్ ఎస్టేట్‌లోని ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు ఏర్పాటు చేశారు. 

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14 ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు బాలీవుడ్‌లోనే కాదు, దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతుంది. తవ్వే కొద్ది కొత్త కోణాలు బయటపడుతూ, ప్రస్తుతం డ్రగ్స్ కేసు వద్ద ఆగింది. సుశాంత్‌ ఆత్మహత్య కేసులో ప్రధాన నింధితురాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని విచారించగా, ఆమె సుశాంత్‌ డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాదు దాదాపు 25 మంది బాలీవుడ్‌ సెలబ్రిటీల పేర్లు చెప్పినట్టు వార్తలొచ్చాయి. అందులో భాగంగా ఎన్‌సీబీ రంగంలోకి దిగి వారిని విచారిస్తోంది.